2012లో అవిభక్త కవలలు వీణా-వాణి ఆపరేషన్ కోసం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విరాళాలు సేకరించింది. రోజులో చాలా సేపు చర్చలు నిర్వహించి దాతల నుంచి విరాళాలు సేకరించింది. ఆ తర్వాత ఆ విరాళాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఈ అంశంపై తరచూ వేమూరి రాధాకృష్ణకు విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా రోజుల పాటు ఎవరూ పట్టించుకోలేదు కానీ .. కొన్నాళ్ల క్రితం.. కొంత మంది వైసీపీ, టీఆర్ఎస్ నేతలు ఇలా వీణా-వాణిల పేరుతోసేకరించిన విరాళాలు వారికి ఇవ్వలేదని ఆరోపించారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది.
అయితే అప్పుడుఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం స్పందించింది. ఆ విరాళాలు సేకరించింది వారి ఆపరేషన్ కోసం అని.. ఆపరేషన్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఇస్తామని చెప్పుకొచ్చింది. ఆ సొమ్మును ప్రత్యేక ఖాతాలో ఉంచామని చెప్పింది. ఇప్పుడు ఆ సొమ్ము రూ. ఐదు లక్షలును వీణా-వాణిలకు చెరి సగం అందించారు. 2012 జనవరి 18 నుంచి ఆగస్టు 31 వరకూ రూ. 2,46,366 విరాళాలు వచ్చాయని.. చాలా కాలం పాటు ఆపరేషన్ జరగలేదని ప్రత్యేక ఖాతాలో చూపి.. ఆతర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని అది ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 5,36,268 అయిందని ఇక ఆపరేషన్ జరుగుతుందో లేదో తెలియదు కాబట్టి వారికి డీడీల రూపంలో ఇచ్చినట్లుగా ప్రకటించుకుంది.
ఈ సొమ్మును వీణ, వాణిల చదువు, ఆరోగ్యం, సంక్షేమం కోసం వినియోగించాల్సిందిగా అధికారుల్ని కోరినట్లుగా చెప్పుకొచ్చింది. కారణం ఏదైనా కానీ ఒకరి పేరుతో విరాళాలు సేకరించినప్పుడు వారికి ఇచ్చేయకపోతే .. నొక్కేశారని నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడే వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయిందే ఈ నిందలు వేమూరి రాధాకృష్ణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పటికైనా ఆ విరాళాలను ఇచ్చి.. భారం దించేసుకున్నారు.