అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు దేశం మొత్తం ప్రతి ఒక్క హిందువు గడప తొక్కి విరాళం అడగడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమయింది. మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయని అయోధ్య రామాలయ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక వేత్తలో కోట్లలో ఇస్తున్నారు. ఇతర నేతలు లక్షల్లో ఇస్తున్నారు. అయోధ్య ఆలయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తుల నుంచే సేకరిస్తున్నారు. దీని కోసమే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
అయితే అయోధ్య అలయాన్ని కట్టాలనుకుంటే… మొత్తం భరించడానికి సిద్ధంగా ఉండే కార్పొరేట్ సంస్థలున్నాయి. మొత్తం కాకపోయినా… ఒక్కో విభాగాన్ని స్పాన్సర్ చేయడానికి కూడా….అనేక కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. కానీ ఈ విషయంలో భక్తుల సెంటిమెంట్‌ను… అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతో… రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క హిందువు భాగస్వామ్యం అయ్యాడన్న సెంటిమెంట్ కల్పించే లక్ష్యంతో అందరి దగ్గరా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఇప్పటికే విరాళాల పుస్తకాలు చేరాయి. వాటితో.. వారు కొన్ని కోట్ల మంది హిందువుల గడపలను తొక్కి.. విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతానికి మూడు రోజుల్లోనే వంద కోట్లు వచ్చాయని చెబుతున్నప్పటికీ.. ముందు ముందు.. ఆ ఆలయానికి రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. దేశంలోని నలుమూలల నుంచి విరాళాలు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో… దేశంలోనే ఆలయ నిర్మాణం కోసం అత్యధిక విరాళాలు పొందిన ఆలయంగా అయోధ్య రామాలయం చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం ప్రారంభమయింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా.. నిర్మాణాన్ని పూర్తి చేసి.. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చే ఎన్నికలకు ముందే ప్రారంభోత్సవం చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.