అందం చూసేదాన్ని బట్టి ఉంటుందంటారు..!. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దీన్నే నిరూపిస్తోంది. చంద్రాబబు .. ఎన్డీఏలో ఉన్నంత కాలం అందంగానే కనిపించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నచ్చలేదు. అందుకే.. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏపీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదనుకున్నారు. ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే.. అప్పట్లో ఇవ్వాల్సిన నిధులన్నీ.. ఇప్పుడు.. వరుసగా విడుదల చేస్తున్నారు. అప్పట్లో… యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని.. పార్టీ పరంగా బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు .. అప్పట్లో ఇచ్చిన యూసీలను చూసి.. నిధులు విడుదల చేస్తున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత “యూసీ”లు బాగున్నట్లు గుర్తించారా..?
ఉపాధి హామీ నిధులను నెలల తరబడి పెండింగ్లో పెట్టిన కేంద్రం… కొత్త ప్రభుత్వం ఏర్పడగానే నిధులు విడుదల చేసింది. గత ప్రభుత్వం పంపిన యూసీలన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకుంది. గతంలో.. ఉపాధి హామీలో అక్రమాలంటూ.. వైసీపీ ఎంపీలు కూడా లేఖలు రాయడంతో.. నిధులు నిలిపివేశారు. ఈ నిధుల కోసం.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు.. పలుమార్లు.. కేంద్ర మంత్రుల్ని… అధికారుల్ని కలిశారు. కూలీలకు డబ్బులు అందకపోవడంతో… ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా పట్టించుకోలేదు. అలా నిధులు ఇవ్వకపోతే.. ఆ ఆగ్రహం… టీడీపీపై మళ్లుతుందని కేంద్రం ప్లాన్. తమ కోరిక నెరవేరినట్లుగా ఉంది. అందుకే.. ఇప్పుడు.. నిధులు విడుదల చేశారు.
పేదల కడుపు మాడ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచారా..?
అప్పట్లో.. యూసీలు సరిగ్గా ఇవ్వలేదని ఆరోపణలు చేసేవారు. ఉపాధి హామీలో అక్రమాలంటూ వైసీపీ నేతలు రాసిన లేఖలను దగ్గర పెట్టుకుని.. విచారణ పేరుతో.. ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్లు కాదు. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం… కేంద్రానికి చేతులు వచ్చాయి. కూలీలు ఇబ్బంది పడుతూండటం… కేంద్రం పెండింగ్ పెట్టడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా…. ఉపాధి కూలీల వేతనాలను చెల్లించింది. అయితే.. కేంద్రం చివరి దశలో అలా కూడా ఇవ్వకూడదన్న నిబంధన పెట్టింది. దాంతో ఎన్నికలకు ముందు.. ఉపాధి హామీ కూలీలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నిజానికి ఉపాధి హామీ పథకం వినియోగంలో.. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కన్నా ఏపీనే ముందు ఉంది. చాలా ప్లాన్డ్గా ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని 2018-19 ఏడాదికిగానూ ఆంధ్రప్రదేశ్ రూ. 9216 కోట్లను రాబట్టుకుంది.
పెండింగ్ పెట్టిన నిధులన్నీ విడుదల చేస్తారా..?
గత ప్రభుత్వ హయాంలో… కేంద్రం ఏపీకి నిధులన్నీ పెండింగ్ పెట్టింది. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల దగ్గర్నుంచి ఉపాధి హామీ నిధుల వరకూ.. వేటినీ మంజూరు చేయలేదు. యూసీలు ఇవ్వలేదన్న కారణం చెప్పేవారు. ఇప్పుడు.. అవే యూసీలను చూసి.. నిధులు విడుదల చేస్తున్నారు. రేపోమాపో.. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు మంజూరు చేస్తారని .. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి… ఇక వెనుకబడిన జిల్లాలకు చెందిన నిధులు విడుదల కావాల్సి ఉంది.