ఐదు రోజుల క్రితం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో ధాన్యం రైతులకు డబ్బులు అందకపోవడంపై.. సంబంధింత కేంద్రమంత్రిని, అధికారుల్ని పిలిపించి మాట్లాడారు. ఏపీలో రైతుల కష్టాలు చెప్పి.. వారికి నిధులు అందేలా చూడాలన్నారు. ఇలా వెంకయ్య సమీక్ష చేయడం.. ఏపీ మంత్రులకు నచ్చింది. కేంద్రాన్ని ఎన్ని సార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదు .. వెంకయ్య చెబితే పని అయిపోతుందని అనుకున్నారేమో కానీ.. కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కలిసి వెంకయ్యనాయుడు ఓ లేఖ రాశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించాలని కోరారు. ఈ లేఖకు స్పందనగా.. నిధులు విడుదలైన సమాచారం.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఏపీకి రూ.2,498.89 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసిన ప్రభుత్వం.. దాదాపుగా రూ. రెండు వేల కోట్లను పెండింగ్లో పెట్టింది. అయితే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. నాలుగున్నరవేల కోట్లు రావాల్సి ఉందన్న ఏపీ సర్కార్ వాదిస్తోంది. కొడాలి నాని.. ఓ సారి ఢిల్లీ వెళ్లి మంత్రుల్ని కలిసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. కానీ వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవడంతో.. వెంటనే నిధులు విడుదలయ్యాయి. కేంద్రం.. ఎఫ్సీఐకి రూ.2,498.89 కోట్లను విడుదల చేసింది.. వీటిని ఎఫ్సీఐ ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేస్తుంది. దీంతో.. ధాన్యం రైతుల సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యే అవకాశం ఉంది.
వెంకయ్యనాయుడు చొరవతో నిధుల విడుదల జరిగింది.కానీ ఇప్పుడు… వైసీపీ నేతలు ఈ నిజాన్ని అంగీకరించడానికి సిద్ధపడకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లనే కేంద్రం నిధులు విడుదల చేసిదంని చెప్పుకునే అవకాశం ఉంది. క్రెడిట్ ను వెంకయ్యకు ఇవ్వడానికి.. వైసీపీ సిద్దంగా ఉండదు.. ఆయనంటే… వైసీపీ నేతలకు పడదు మరి..!