ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తోంది. ఈ వివరాలను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. అయితే.. ఇంత పెద్ద మొత్తాన్ని కేంద్రం ఎక్కడ నుంచి సమీకరిస్తుందన్నది పెద్ద ప్రశ్న. జీడీపీని పట్టించుకోకుండా నోట్లు ముద్రిస్తే దేశంలో ఆరాచకం ఏర్పడుతుంది. మరి ఎలా ఆ మొత్తాన్ని సమకూర్చుకుంటుందనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి సమాధానంగా.. పెట్రోల్, డీజిల్ వైపు చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. వాటి మీద వచ్చే … పెంచబోతున్న పన్నులతోనే.. దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ధన ఇంధనాన్ని సమకూర్చాలనుకుంటోంది. వీటితో పాటు ఆర్బీఐ డివిడెండ్‌ను కూడా ఉపయోగించుకోబోతోంది.
అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయాయి. బ్యారెల్ ధర ఇరవై డాలర్లలోపే ఉంది. కానీ భారత్‌లో మాత్రం లీటర్ రూ. 75 కి తక్కువ కాకుండా అమ్ముతున్నారు. ఇందులో రూ. యాభై ఐదు రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఇలా ఏటా ప్రభుత్వానికి రూ. మూడు లక్షల కోట్లకుపైగా వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు.. ప్రజలకు ఆ లాభాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కేంద్రం.. మే 5న గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై లీటరుకు రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు వల్ల 2021 ఆర్థిక ఏడాదిలో రూ. 1,75,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఇంతటితోనే సరిపెట్టుకోవడం లేదు.. త్వరలో లీటరుకు రూ. 3-6 పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని ద్వారా సుమారు రూ. 50,000-60,000 కోట్లు అదనపు రాబడి రానుంది. అంటే ఐదు లక్షల కోట్ల వరకూ.. ప్రజల నుంచి పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారానే పిండుకుంటారన్నమాట.
ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను డివిడెండ్ రూపంలో కేంద్రం తీసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.1,76,000 కోట్లు తీసుకుంది. ఈ ఏడాది కూడా ఇంతే మొత్తంలో తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు, అదనపు ఖర్చులకు గాను ప్రభుత్వం ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని 50 శాతానికిపైగా పెంచింది. 2020-21 ఏడాదికిగాను రుణాలు బడ్జెట్ అంచనా రూ. 7.80లక్షల కోట్లుగా వేసింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దానిని రూ. 12 లక్షల కోట్లకు పెంచింది. అంటే.. పన్నులు, ఆర్బీఐ, రుణాల ద్వారా మొత్తం ప్యాకేజీ నిధులు సమకూర్చుకుంటోందన్నమాట. ఇంతా చేసి.. ఆ నిధులన్నీ.. పరిశ్రమలకు.. ప్రజలకు అప్పుల రూపంలోనే అందిస్తోంది.