దావూద్ ఇబ్రహిం వాడిన ఆలీవ్ రంగు కారుని వేలం కొన్న అఖిలభారత హిందూమహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ దానికి నిప్పుపెట్టి అంత్యక్రియలు చేశారు. ఇవ్వాళ మధ్యాహ్నం అనుకున్న సమయానికి శాస్త్రోక్తంగా కారుకు నిప్పుపెట్టారు. ఢిల్లీకి చేరువలోనే ఉన్న ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో ఒక ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడకు దావూద్ వాడిన కారు (ఇప్పుడది డొక్కకారుగా మారింది) ఈడ్చుకొచ్చి, దానిపై కట్టెలు ఉంచి శవదహన సంస్కారం చేసినట్లుగా భావిస్తూ కారుని తగలెట్టారు. ఈ అంత్యక్రియలకు కర్తృత్వం చక్రపాణి మహరాజ్ తీసుకున్నారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం వాడిన అనేక వస్తువులతోపాటుగా ఈ కారుని కూడా ముంబయిలో డిసెంబర్ 9న వేలానికి ఉంచారు. ఆ వేలంలో చక్రపాణి మహరాజ్ దాన్ని 32వేల రూపాయలుపోసి కొన్నారు. దావూద్ అతని ముఠా వల్ల దేశానికి జరుగుతున్న అరిష్టాలు తొలిగిపోయాయని చెప్పడానికి నిదర్శనంగానే కారుకి అంత్యక్రియలు చేశారట. మొదట్లో ఈ కారుని మంచి కోసం ఉపయోగిద్దామనుకున్నారు. అంబులెన్స్ గా వాడాలని కూడా అనుకున్నారు. అయితే ఈలోగానే దావూద్ ముఠా మనుషులు ఫోన్లలో బెదరించడంతో , ఇందుకు నిరసనగా కారుకి అంత్యక్రియలు చేయాలని చక్రపాణి మహరాజ్ నిర్ణయించారు. పైగా వేలంలో కొన్న ఈ కారు డొక్కుగా మారింది. ఇది ఏ రకంగానూ ఉపయోగించే పరిస్థితిలో లేదు.
చక్రపాణి మహరాజ్ మొబైల్ ఫోన్ కి ఈ ఉదయం (బుధవారం) కూడా బెదరింపులొచ్చాయి. ఎన్ని బెదరింపులు వచ్చినా లెక్కచేయకుండా అనుకున్నట్లుగానే కారుని దగ్ధం చేశారు. ఈ కారు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న హిందూ మహాసభ కార్యకర్తలు, జాతీయ పతాకాలను చేతుల్లో ధరించి, `భారతమాతకు జై..’ అంటూ నినాదాలు చేశారు.
ముంబాయిలో కారు కొన్నతర్వాత దాన్ని గుజరాత్, హర్యానా, ఢిల్లీల మీదగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు నిన్న సాయంత్రానికే చేర్చారు. ఘజియాబాద్ లోని ఇందిరాపురంలో ఉన్న కనవాణి ప్రాంతంలో కారుకు అంత్యక్రియలు చేశారు. అయినప్పటికీ ఘజియాబాద్ పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతం నొయిడాలోని సెక్టర్ 58వ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు చేతులు దులుపుకున్నారు.