లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పై ఈడీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. చెన్నైలోని ఆయన కార్యాలయాల్లో కనీసం పాతిక కోట్ల వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఈయన కంపెనీపై ఈడీ దాడులు సంచలనమే అనుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో మేఘా కంపెనీ కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది శాంటియాగో మార్టిన్‌కు చెందిన కంపెనీస్. ఫ్యూచర్ గేమింగ్ పేరుతో ఈ కంపెనీ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.,
దేశవ్యాప్తంగా దాదాపుగా పధ్నాలుగు వందల కోట్ల వరకూ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చారు. ఇందులో అత్యధికం బెంగాల్ లోని తృణమూల్‌కు.. తమిళనాడులోని డీఎంకేకు ఇచ్చారు. తర్వాత జగన్ పార్టీకే ఇచ్చారు. డీఎంకేతో మార్టిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ అక్కడ లాటరీలకు అనుమతి లేదు. బెంగాల్లో లాటరీలకు అనుమతి ఉంది. ఆ ఇద్దరికీ విరాళాలు ఇవ్వడంలో ఔచిత్యం ఉంది..మరి జగన్‌కు ఎందుకు ఇచ్చారు ?
రూ. 149 కోట్లు అంటే చిన్న మొత్తంకాదు. గతంలో ఏపీలో లాటరీలను, కాసినోలను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సజ్జల నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేశారు. శాంటియాగో మార్టిన్ వ్యాపారాలను విశాఖతో పాటు ఏపీ మొత్తం ఏర్పాటు చేసుకునేవిధంగా నివేదిక రెడీ చేశారు. ప్రభుత్వానికి 11 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందుకే ఫండింగ్ వచ్చిందని చెబుతున్నారు. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంచనాకు రావడంతో ఆగిపోయారు.
ఇప్పుడు శాంటియాగో మార్టిన్ పై జరిపిన ఈడీ దాడుల వ్యవహారంలో వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా..ఆ ఫండింగ్ గురించి ఆరా తీస్తారా అంటే అవకాశాలు తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే.. బీజేపీకి కూడా ఆయన రూ. వంద కోట్ల వరకూ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు.