ఇల్లు అలకగానే పండగ కాదు. ఇది నిజం. పండగ అంటే ఇంకా చాలా వుంటుంది. ఈ ఎన్నికల్లో గెలవగానే సరిపోదు. అది జగన్ అయినా, చంద్రబాబు అయినా. వ్యవహారం చాలా వుంది.
ఎవరు వచ్చినా, ఇప్పుడు వస్తున్న పింఛన్లు మూడు వేలు చేయాలి. నిరుద్యోగ భృతి పెంచాలి. కేంద్రం ఇచ్చిన వ్యవసాయ హామీకి తన హామీ జత చేయాలి. ఇంకా చాలా హామీలు వున్నాయి. వీటన్నింటికీ డబ్బు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి?
పసుపు కుంకుమ కోసం బ్యాంకుల దగ్గర బాండ్లు పెట్టి అప్పు తెచ్చారు
అప్పటికప్పుడు. మలి విడత అప్పు తేవాలంటే కేంద్రం వీల్లేదంది. కేంద్రంలో మళ్లీ మోడీనే వచ్చే అవకాశాలు వున్నాయంటున్నారు. రాకపోతే పరవాలేదు. మోడీ కాస్త రీజనబుల్ మెజారిటీతో వస్తే కేంద్రం నుంచి సాయం మాట దేవుడెరుగు, ఎడా పెడా రుణాలు తెచ్చుకునే వీలు వుండదు.
గత అయిదేళ్లలోనే భయంకరంగా రుణాలు తెచ్చారు. మున్సిపాలిటీల చేతి విడివిడిగా లోన్లు తెప్పించి, పట్టణాలకు సోకులు చేసి, అది రాష్ట్రప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారు. బాగానే వుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి. పన్నులు పెంచితే ఓ బాధ, పెంచకపోతే మరో బాధ.
ఇంకోపక్క ఉద్యోగుల పీఆర్సీ వుంది. దాని అరియర్స్ వున్నాయి. చిరకాలంగా డిఎ బకాయిలు వున్నాయి. వీటన్నింటికి నిధులు కావాలి. ఎక్సయిజ్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ ఆదాయాలే దక్కు. అలాగే కేంద్రం నుంచి వచ్చే వాటాలు. కానీ కేంద్రం ఆ వాటాలను వివిధ పద్దుల కింద ఇస్తే, అందుకే ఖర్చు చేయాలి అంటోంది.
యుటిలైజేషన్ సర్టిఫికెట్ లు అడుగుతోంది. ఇవన్నీ సమస్యే. జగన్ కు అయినా ఈ నిబంధన తప్పకపోవచ్చు.
ప్రజలు ఈసారి వెయ్యి కళ్లతో గమనిస్తారు. మొదటి ఆరు నెలల్లోనే అసంతృప్తి రాకుండా చూసుకోవాలి. లేదంటే పంచాయతీలు, మున్సిపాల్టీలు దెబ్బ అయిపోతాయి.
ఇవన్నీ అలా వుంచితే ఈసారి ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినా భయంకరమైన ఆకలి మీద వుంటారు. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చు చేసారు. అదంతా ఎంత త్వరగా రాబట్టుకుందామా అని చూస్తారు. ఈ విషయంలో బాబు అయినా, జగన్ అయినా వారిని కట్టడి చేయడం కష్టం. ఎంతయినా ఖర్చు చేసి గెలవమని చెప్పి, ఇప్పుడు సంపాదించుకోవద్దంటే ఎలా?
అందువల్ల ఇక బెల్ట్ షాపులు, ఇసుక, రియల్ దందాలు, నామినేషన్ కాంట్రాక్టులు అన్నీ ఓ రేంజ్ లో వుంటాయి.
బాబు మఖ్యమంత్రి అయితే ఫరావాలేదు. మీడియా కొంత వరకు దాచే ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా జగన్ ముఖ్యమంత్రి అయితే మర్నాటి నుంచే మొదలవుతుంది వ్యవహారం.
మొత్తం మీద ఈ అయిదేళ్లు ఎవరికి అయినా గడ్డుకాలమే. ముఖ్యంగా ప్రజలకు. వేలకు వేలు తీసుకుని ఓట్లేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు కదా?