ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారన్న కథనాలకు పెద్దగా ఆధారం లేదు. డక్కన్‌క్రానికల్ ఇచ్చిన ఈ కథనాన్ని ఈ పత్రికలు కూడా బాగానే ప్రచారంలో పెట్టాయి. గతంలో ఆయనను రాజ్యసభకు పంపిస్తారని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇప్పించి ముందు జాతీయ నాయకుడుగా ముందుకు తెస్తారని వూహాగానాలు సాగాయి. అప్పట్లో నేనొక కేంద్ర మంత్రిని ఈ విషయమై అడిగితే తనతో ముఖ్యమంత్రి అనలేదని చెప్పారు. అయితే వస్తే మంచిదేగా అని కూడా జోడించారు. లోకేశ్ రావడం ఆయన స్థానంలోనేనని ప్రచారం జరుగుతున్నందున ఈ మాటలను పెద్ద తీవ్రంగా తీసుకోవలసిన అవసరం కనిపించలేదు. ఇంతలోనే ఇప్పుడు రాష్ట్ర మంత్రి అవుతారని కథనాలు మొదలయ్యాయి. ఈ కథలకు రెండు కారణాలున్నాయి. మొదటిది- లోకేశ్‌కు కీలకస్థానం కల్పించాలని చంద్రబాబు ఎంతగా కోరుకుంటున్నా ఇప్పటి వరకూ సరైన గాడిలో పడలేదన్న ఒక అసంతృప్తి. రెండవది- ఆయనను ముందు పెట్టుకున్న కొందరు తెలుగుదేశం నాయకుల లాబీ కావాలని ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం.ఈ రెండో కోణంలోనే చంద్రబాబు ఎక్కువ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. లోకేశ్ ఇంకా స్థిరపడకపోవడం ఆయనకు ఎక్కువ దిగులుగా వుందని బాగా సన్నిహితంగా వుండే ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు. అయితే మామూలు మంత్రిగా తనను తీసుకుంటే స్థానం పెరుగుతుందా తగ్గుతుందా? దానివల్ల మిగిలిన విషయాలన్నిటిలో జోక్యం చేసుకునే అవకాశం తగ్గిపోతుంది కదా ఇలాటి ప్రశ్నలు కూడా వున్నాయి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలే నిరవధికంగా నానబెట్టే చంద్రబాబు కుమారుడి విషయంలో తొందరపడరని మాత్రం చెప్పొచ్చు.
తెలంగాణలో కెటిఆర్‌తో లోకేశ్‌ను పోల్చడం తగదని కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు లోకేశ్‌కు ఇస్తారంటున్న శాఖలు కూడా అచ్చంగా కెటిఆర్ చూస్తున్నవే కావడం ఆసక్తికరం. ఇక్కడే ఆయన చుట్టూ వున్న లాబీని సందేహించవలసి వస్తుంది. కెటిఆర్‌తో పోలిక తెలంగాణకు తప్ప ఎపికి పెద్దగా వర్తించదు. టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో సాగిన ఓటుకు నోటు వ్యవహారంలో లోకేశ్ కొద్దిలో తప్పించుకోగలిగారు. ఆయన హైదరాబాదులో పుట్టారు గనక తెలంగాణలో పార్టీ నాయకత్వం అప్పగించాలని భావించిన చంద్రబాబుకు ఇక్కడ భవిష్యత్తు నామమాత్రమని ఈపాటికి అర్థమై పోయింది. కనుక కెటిఆర్‌తో పోటీ పడటమనే ఆలోచనతో ఆయన హడావుడి పడరు. వాస్తవానికి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చంద్రబాబు చేరిక కూడా బాగా ఆలస్యంగా జరిగింది. తర్వాత ఏడాది తిరక్కుండానే ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత వారసులను ప్రతిష్టించడం అనధికార రాజ్యాంగంగా చలామణి అవుతున్నది గనక లోకేశ్‌కు తన పాలనలోని ఎపిలోనే స్థానం కల్పించాలని చంద్రబాబు కోరుకుంటారు. ఇది ఎప్పుడు ఏ విధంగా చేస్తారనేది మాత్రం ఇప్పటికి అస్పష్టమే. కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా మంత్రి పదవి కంటే ఎగువ సభల సభ్యత్వం ఇప్పించి గౌరవం కల్పించే అవకాశం ఎక్కువ. తర్వాత వచ్చే ఎన్నికలనాటికి ఈ స్థానాన్ని మరింత విస్త్రతం చేయొచ్చు. ఈ లోగా లోకేశ్ చుట్టూ చేరే లాబీ చేతులు కట్టేయడం, ఆయన పొరబాట్లలో చిక్కుకోకుండా చూడటం పెద్ద సవాలేనంటున్నారు ఆ పార్టీ నేతలు.
బాలయ్య వర్సెస్ బావయ్య
తెలుగు 360లో గతంలో చెప్పుకున్నట్టు ఒక్కరోజైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలన్న బాలయ్య బావ కోర్కె నేపథ్యంలో చంద్రబాబు అల్లుడి పదవిని చూసి ఆనందించేలా నచ్చజెప్పవలసి వుంటుంది. ఈ మధ్యన బాలయ్యను అదేపనిగా మాట్లాడించి కాస్త విమర్శలకు అవకాశమివ్వడంలోనూ చంద్రబాబు మార్కు చతురత వుందని ఒక కథనం. రోజాను క్షమించడానికి ఒక దశలో ఆయన సిద్ధమైనా ఆమెతో నటించిన హీరో బాలయ్య ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలిసి ఆ ప్రసక్తివదిలేశారని అధికార పక్ష నేతలు చెబుతున్నారు.