శివానీ, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా మారిపోయారు. శివానీ కంటే ముందే కెమెరా ముందుకొచ్చింది శివాత్మిక. కాకపోతే శివాత్మిక సినిమానే (దొరసాని) ముందుగా విడుదలైంది. దొరసాని ఫలితం ఎలాగున్నా – శివాత్మికకు ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. యంగ్ హీరోలకు హీరోయిన్లు కరువైన ఈ పరిస్థితుల్లో శివాత్మికకు ఫ్యూచర్ కనిపిస్తోంది. ఇప్పటికే శివాత్మిక చేతిలో రెండు ఆఫర్లు ఉన్నాయి. కాకపోతే ఏదీ ఫైనలైజ్ చేయలేదు. `దొరసాని` ఫలితం చూసుకున్నాకే తదుపరి సినిమా ఫైనలైజ్ చేయాలని జీవిత భావించింది. ఓ వారంలోగా శివాత్మిక తదుపరి చిత్రం ఖారారు అవుతుంది.
శివానీ `టూ స్టేట్స్`తో ఎంట్రీ ఇద్దామనుకుంది. అయితే ఆ సినిమా అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. అంతకు ముందే శివానీ కథానాయికగా ఓ సినిమా మొదలై ఆగిపోయింది. అయితే ఈమధ్య శివానీ కథానాయికగా ఓ సినిమా గప్ చుప్‌గా పట్టాలెక్కింది. ఇంద్ర సినిమాతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ (ఓ బేబీలో కీలక పాత్ర పోషించాడు) ఇందులో హీరో. `అ`,` కల్కి` చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ శిష్యుడు ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. శివానీ, శివాత్మిక కెరీర్ ని జీవిత జాగ్రత్తగానే ప్లాన్ చేస్తోంది. అవకాశాలు జోరుగా వస్తున్నా – కథల విషయంలో జీవిత చాలా పట్టుగా ఉందని, కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలవైపే జీవిత మొగ్గుచూపిస్తోందని, గ్లామర్ పాత్రలకు ముందే చెక్ పెడుతోందని తెలుస్తోంది.