కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజనకు నిర్ణయించుకున్న తర్వాత సీమాంధ్ర ప్రజల్లో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ మీద తిరగబడ్డారు. సమైక్యాంద్ర కోసం చివరి బంతి దాకా పోరాడుతానన్నారు. చివరి బంతి వచ్చాక చేతులెత్తేశారు.
అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునాయుడు కానీ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కానీ మరి ఏ ఇతర పార్టీ నాయకులు కానీ సహేతుకంగా ఆలోచించి ముందుచూపుతో – ప్రత్యేక హోదాను తెలంగాణ విభజన చట్టంలో పొందుపరచాలని, విభజన చట్టంలో పొందుపరుస్తున్న హామీలకు స్పష్టమైన గడువు విధించాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నఆ పదేళ్ళు హైదరాబాద్ రెవెన్యూ షేర్ చేసుకోవాలని, ఇటువంటి ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే ప్రతిపాదనలు ఎవరు చేయలేదు. చంద్రబాబు నాయుడు – రాజధానికి నాలుగు లక్షల కోట్లు అవసరమని రాజధాని మీద ఫోకస్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి- చంద్రబాబు నాయుడు కారణంగానే విభజన జరుగుతోందని ప్రజల్లోకి వెళ్లారు. చిరంజీవి లాంటి వాళ్లు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సూచించి అటు ఇటు ఇద్దరికీ ద్వేషి అయ్యారు. అయితే ఇదంతా గతం కానీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అనివార్యంగా విభజన నాటి పరిణామాలతో ముడిపడి ఉండడమే.
ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాకతో కాంగ్రెస్ బలపడుతుందా?
మైనస్: 2014 ఎన్నికలలో ఒకరిద్దరు తప్ప మొత్తం అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో “నోటా” తో పోటీపడ్డారు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు ఉంటుందని ఆశించలేం. పైగా కిరణ్ కుమార్ రెడ్డి స్వతహాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కాదు. తన నియోజకవర్గం వరకు, లేదంటే మరో రెండు మూడు నియోజకవర్గాలకు ప్రభావం చూపగల నేత మాత్రమే.
ప్లస్: కానీ అతని చేరిక వల్ల జరిగే ప్రయోజనమేదైనా ఉంటుందంటే అది ఒక్కటే – గతం లో సీఎం గా చేసాడు కాబట్టి చాలా మంది కాంగ్రెస్ నేతలతో ఆయనకి ఉన్న సంబంధాల కారణంగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ని వీడకుండా చేయడానికీ, వీలైతే కొంతమంది నాయకులని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావడానికీ ఉపయోగపడవచ్చు. అయితే “ఆయన అడిగాడన్న ఒకే కారణం తో”, నీరసంగా ఉన్న పార్టీ లోకి ఎంతమంది వస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే.
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం కాంగ్రెస్ నాయకుల కంటే తెలుగుదేశం నాయకులకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తోందా
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి తుడిచిపెట్టుకు పోవడం తో ఆ ఓట్లన్నీ జగన్ పార్టీకి వెళ్లాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న రెడ్లు, దళితులు, మైనారిటీలు, ఇతర బీజేపీ వ్యతిరేక వర్గాలు జగన్ పార్టీతో పయనించాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ బలపడితే ఆ మేరకు ఖచ్చితంగా జగన్ పార్టీకి నష్టం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. దాంతో సహజంగానే అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా లో కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక మీద అద్భుతమైన హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ బలపడితే ఆ మేరకు జగన్ పార్టీకి నష్టం కలుగుతుందని విశ్లేషణ కారణంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో జగన్ పార్టీలో, జగన్ మీడియాలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక మీద అయితే నిర్లిప్తత లేదంటే వ్యతిరేకత కనిపిస్తోంది.
ఈ ఉత్సాహం కాంగ్రెస్-తెలుగు దేశం పొత్తుకి దారి తీస్తుందా
ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య దోస్తీకి సానుకూల వాతావరణం ఏర్పడినట్టు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులు తెలంగాణలో నిద్రాణమై ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఒక మూడు శాతం దాకా ఉండవచ్చని ,అది ఫలితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ కు అదే 2% బ్యాంక్ ఉండి ఉండవచ్చు. కాబట్టి ఈ “mutually complementing” కోణం లో ఈ రెండు పార్టీల మధ్య అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్రాలోనూ దోస్తీ ఏర్పడే ఆస్కారం ఉంది. తెలంగాణా లో టిడిపి కి ఉన్న 2% – 3% ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి, ఎపి లో కాంగ్రెస్ కి ఉన్న 2% – 3% ఓటు బ్యాంక్ టిడిపి కి బదలాయించగలిగితే ఆ రెండు పార్టీలకి దీనివల్ల లాభమే.
కానీ ఈ కాగితపు లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది సందేహం కాంగ్రెస్ బలోపేతం చెందిన మహా అంటే ఇంకొక ఒకటి రెండు శాతం ఓట్లు పెరగొచ్చు తప్ప సీట్లు సాధించే పరిస్థితి ఈసారి కూడా ఉంటుందని అనుకోలేము. ఈ రెండు పార్టీల మధ్య దోస్తీకి ప్రస్తుతం ఉన్న ఏకైక ఆటంకం – “తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద ఏర్పడడమే”. కాబట్టి అలాంటి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ వస్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది.
అసలు ఆంధ్రలో కాంగ్రెస్ ఎప్పటికి బలపడుతుంది
గతంలో ఇదే విషయంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కుల ఊచకోత తదితర పరిణామాల తర్వాత జీవితంలో మరెన్నడూ పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదని, కానీ ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉటంకిస్తూ ఆంధ్రలో కూడా అలాగే మళ్లీ తాము భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని ప్రకటించి ఉన్నారు రాహుల్ గాంధీ. అయితే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఇతర పార్టీలు చేయలేకపోవడం, జైల్ సింగ్ లాంటి నాయకులు కాంగ్రెస్‌లోనే కొనసాగి అత్యున్నత పదవులు పొందటం లాంటి మరెన్నో కారణాలవల్ల పంజాబ్ లో కాంగ్రెస్ పునర్వైభవం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సిపి ఆవిర్భవించి, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ని విజయవంతంగా తన వైపు మళ్ళించుకోగలిగింది. కాబట్టి కాంగ్రెస్ బలపడడం అనేది అనివార్యంగా జగన్ బలహీనపడడం అనే అంశం పైనే ఆధారపడి ఉంది. ఈ కారణంగానే ఇటీవల ప్రత్యేకించి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరతారని ఊహాగానాలు మొదలైనప్పట్నుంచీ అధికార తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు ఆదేశాలు వెళ్తున్నాయి.
అయితే సమీప భవిష్యత్తులో, అంటే మరొక ఐదేళ్లపాటు కాంగ్రెస్ ఆంధ్రలో బలపడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా కాంగ్రెస్ వచ్చి, ఆంధ్ర కు ప్రత్యేక హోదా ప్రకటించి, ఆంధ్ర ప్రజలను శాంతింపజేయడం లాంటివి చేస్తేనో, లేదంటే అనూహ్యంగా జగన్ బలహీనపడి భవిష్యత్తులో ఎప్పుడైనా కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంది . అంతే తప్ప స్వంతంగా గా బలపడే అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించడంలేదు.
ఫైనల్ గా:
ఇంతటి ఎదురీత చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను గట్టుకి చేర్చడం కిరణ్ కుమార్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని ఆశించడం అత్యాశే కాదు అమాయకత్వం కూడా అవుతుంది.
-జురాన్