ముద్రగడ పద్మనాభం, హర్ష కుమార్, చింతా మోహన్ లతోపాటు అంబేద్కర్ కుటుంబీకులను కూడా భాగస్వాములుగా చేస్తూ ఏర్పాటుచేసిన కాపు దళిత సమ్మేళనం విఫలం అయిందా? మాజీ ఎంపీ హర్ష కుమార్ అలకబూని సభ మధ్యలోనే వెళ్లిపోయాడా? కేవలం తన ఫ్లెక్సీ పెట్టలేదని అలిగాడా? ఎన్నో అంచనాల మధ్య మొదలైన కాపు దళిత సమ్మేళనం చివరికి ఏ ఫలితాన్నీ ఇచ్చింది ? ప్రధాన మీడియా ఛానల్స్ ఈ సభను బొత్తిగా కవర్ చేయకుండా వదిలివేయడంతో ఏవి వాస్తవాలు అనేది చాలా మందికి తెలియడం లేదు. ఇంతకీ ఏం జరిగింది.
హర్ష కుమార్ అలక వాస్తవమే:
కాపు దళిత సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొన్న హర్షకుమార్ అలకబూనిన మాట వాస్తవమే. అయితే సోషల్ మీడియాలో కొంతమంది, ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదనే కారణంతోనే హర్ష కుమార్ అలకబూనాడని వ్రాసుకొచ్చారు. కానీ హర్షకుమార్ అలకకు కారణం అది కాదని తెలుస్తోంది. పైగా 99 టీవీలో వచ్చిన విజువల్స్ లో స్టేజి పైన హర్షకుమార్ ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతకీ హర్షకుమార్ అలక కి కారణం ఏమిటంటే, కాపు దళిత సమ్మేళనం పేరిట ఏర్పాటు చేసిన ఈ సభలో అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తి ఇండియా ప్రజాబంధు అనే ఒక నూతన పార్టీని ప్రకటించాడు. అద్దంకి రంజిత్ ఓఫిర్ చాలామంది క్రిష్టియన్లకు బాగా తెలిసిన వ్యక్తి. గతంలో టీవీ5 లో హిందూ మత పెద్దలతో ఏర్పాటుచేసిన ఒక సంచలనాత్మక డిబేట్ లో క్రైస్తవ మతం తరపున పాల్గొన్నాడు కూడా. అయితే ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేయడం, దానికి ఈ సభను వేదికగా వాడుకోవడం హర్షకుమార్ కి నచ్చలేదు. ఏ నాడు దళిత సమస్యల పట్ల ప్రజాజీవితంలోకి రానటువంటి వ్యక్తులు స్థాపించే పార్టీలను ప్రోత్సహించడానికి ఈ సభ వేదిక గా ఉందని హర్ష కుమార్ సభ నుంచి నిష్క్రమించాడు. సభ ప్రాంగణం చుట్టూ కాపు నేతల ఫోటోలు మాత్రమే ఉన్నాయని కూడా హర్షకుమార్ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇది కేవలం సాకు మాత్రమే లాగా కనిపిస్తోంది. నిజమైన కారణం మాత్రం, మరొక దళిత వ్యక్తి ( దళిత క్రైస్తవుడు ) స్థాపిస్తున్న పార్టీకి ఈ సభ వేదిక గా మారడమే ప్రధాన కారణం.
పశ్చాత్తాపం ప్రకటించిన ముద్రగడ
హర్ష కుమార్ సభలో పాల్గొనకుండా వెనుదిరగడం తనకెంతో బాధ కలిగించిందని ముద్రగడ ఆ తర్వాత ప్రసంగిస్తూ అన్నారు. హర్ష కుమార్ తనకు ఎంతో ఆప్తుడని, ఆయనతో తాను మాట్లాడతానని, తానే ఆయనను వేదిక మీదకు పిలవాలని అనుకున్నానని, ఆయనకు అవమానం జరిగితే తామందరికీ అవమానం జరిగినట్టేనని భావిస్తానని, జరిగిన పొరపాటుకు హర్షకుమార్ పెద్ద మనసు చేసుకుని మన్నించాలని ముద్రగడ తో పాటు, ఐక్య వేదిక నిర్వాహకులు అంతా హర్షకుమార్ కి విజ్ఞప్తి చేశారు.
కాపు దళిత సమ్మేళనానికి బ్రేక్ పడినట్టేనా?
అయితే హర్షకుమార్ వెనుదిరగడం వల్ల కాపు దళిత సమ్మేళనానికి బ్రేక్ పడినట్టే నా అంటూ కొన్ని చర్చలు ముందుకొచ్చాయి. కానీ విశ్లేషకులు మాత్రం ఇలాంటి ఐక్యవేదిక లు నిర్వహించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపొచ్చాలు సాధారణమేనని, వాటిని సరి చేసుకుంటూ ఎంత వరకు ముందుకు వెళ్తారనే దానిమీద ఈ సమ్మేళనం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
మాజీ ఎంపీ చింతా మోహన్ మాట్లాడుతూ, కాపులు దళితులు కలిస్తే దాదాపు 40 శాతం వరకు ఉంటారని, వీరిద్దరూ ఏకమైతే రాజ్యాధికారం సునాయాసంగా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ అవగాహన దళిత నేత అయిన చింతామోహన్ తో పాటు అక్కడున్న కాపు నేతలు అందరిలో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పొరపాట్లను సరిచేసుకోవడానికి వారు ముందుకు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రంజిత్ ఓఫిర్ పార్టీకి సంబంధించిన సమాచారం హర్ష కుమార్ కి ముందుగా ఇవ్వకపోవడం లాంటి కమ్యూనికేషన్ గ్యాప్ భవిష్యత్తులో సరిచేసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ బహుజన సమాజ్ వాది పార్టీ తో ఎటువంటి అవగాహనకు వచ్చారనే విషయము కూడా ఈ కాపు దళిత సమ్మేళనం అనే ప్రాతిపదికను ప్రభావితం చేస్తుంది. పైగా హర్ష కుమార్ కూడా , కాపు దళిత సమ్మేళనం ద్వారా రాజ్యాధికారం అనే ఒక పెద్ద అంశాన్ని తలకెత్తుకున్న ప్పుడు, భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల విషయంలో పట్టువిడుపు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, అలా ప్రదర్శించే అవకాశం ఉంది.
కాపు దళిత సమ్మేళనం విషయంలో ఇది మొదటి అడుగే కాబట్టి, భవిష్యత్తులో ఈ సమ్మేళనం ముందుకు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అది రాజకీయంగా ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం 2019 ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.