కేవలం భాజపా శ్రద్ధ పెట్టలేదు కాబట్టే, ఇన్నాళ్లూ ఆంధ్రాలో ఆటలు సాగాయనీ, తాము ఫోకస్ చేయడం మొదలుపెడితే అవినీతి ఏవిధంగా బయటపడుతుందనేది త్వరలోనే చూస్తారంటూ వ్యాఖ్యానించారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. రాష్ట్రం స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో అవినీతిని ఎలా విస్తరించారో అన్ని విషయాలు త్వరలోనే బయటకి వస్తాయన్నారు. టీడీపీ సర్కారు చేసింది లక్ష కోట్లకుపైగా అవినీతి అంటూ జీవీఎల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కేవలం వందల్లో మాత్రమే పర్సనల్ డిపాజిట్ అకౌంట్లు ఉంటాయనీ, కానీ ఆంధ్రాలో వేల సంఖ్యలో ఎందుకొచ్చాయనీ ఆయన ప్రశ్నించారు. కాగ్ నివేదికలోని ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు.
ఇలాంటి రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా ఉన్నాయనీ, బయటకి వస్తే వారి అవినీతి తేటతెల్లమౌతుందన్న భయంతో తొక్కిపెట్టి ఉంచారని జీవీఎల్ ఆరోపించారు. కొన్ని రంగాల్లో దారుణమైన అవినీతి బయటకి రాకుండా టీడీపీ జాగ్రత్తపడుతోందనీ, ఎక్కువ కాలంపాటు వాటిని బయటకి రాకుండా ఆపలేరని చెప్పారు. అవినీతిని దాచి పెట్టాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదనీ, పర్సనల్ అకౌంట్ డిపాజిట్లకు సంబంధించి ముందుగా సమాధానం చెప్పాలన్నారు. ఈ అకౌంట్ నుంచి ఖర్చు పెట్టిన సొమ్మును ఆడిట్ చేయడానికి కాగ్ కి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇలాంటివి చాలా ఉన్నాయనీ, అన్నీ బయటకి వస్తున్నాయని చెప్పారు!
టూజీ స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ స్కామ్, కామన్ వెల్త్ స్కామ్.. ఇలాంటి భారీ కుంభకోణాల తరహాలోనే టీడీపీ ప్రభుత్వంవారి పర్సనల్ అకౌంట్స్ డిపాజిట్ స్కామ్ కూడా త్వరలోనే బయటకి వస్తుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన సమాచారం వెంటనే బయటకి పెట్టకపోతే… ప్రజాక్షేత్రంలో టీడీపీ అసలు స్వరూపాన్ని ఎలా నిలబెట్టాలో తమకు బాగా తెలుసునని జీవీఎల్ అన్నారు. ఆ దిశగా తాము ప్రయత్నం చేయబోతున్నామని చెప్పారు. ఇవన్నీ తాను చేస్తున్న ఆరోపణలు కాదనీ, కాగ్ లో ఉన్న లెక్కలేనని జీవీఎల్ అన్నారు.
మొత్తానికి, టీడీపీపై ఏదో ఒక ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు జీవీఎల్. ఆంధ్రాలో మరీ అంత భారీ కుంభకోణం జరుగుతూ ఉంటే.. ఎవరు మాత్రం ఉపేక్షిస్తారు? ఒకటి కాదు… చాలా కుంభకోణాలున్నాయట. అయినా, కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది కదా, వారే విచారణలకు ఆదేశించి… జీవీఎల్ అంటున్న భారీ స్కాములు బయటపెడితే మంచిదే కదా! పార్టీపరంగా భాజపాకి కూడా ఏపీలో తిరుగులేని బేస్ దీంతో ఏర్పడినట్టు అవుతుంది.