తెలంగాణా ఉద్యమం పరాకాష్టకు చేరుకొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు తెరాసలోకి జంప్ అయ్యారు. వారిలో పెద్దపల్లి ఎంపీ జి. వివేకానంద (వివేక్) కూడా ఒకరు. కానీ తెరాసలో ఇమడలేక మళ్ళీ కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేసారు. ఆయన మళ్ళీ ఇప్పుడు తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్నారని తాజా సమాచారం. వరంగల్ లోక్ సభ నియోజక వర్గం నుండి తెరాస తరపున పోటీ చేసేందుకు బలమయిన అభ్యర్ధి లేకపోవడంతో వివేక్ ని తిరిగి తెరాసలోకి రప్పించి ఆయనను బరిలో దింపాలని తెరాస ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం తెరాస సెక్రెటరీ జనరల్ కే. కేశవ్ రావు నివాసంలో మంత్రి హరీష్ రావు ఆయనతో నిన్న రాత్రి చర్చలు జరిపారు. తెరాసలో చేరి వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి వివేక్ అంగీకరించినట్లు తాజా సమాచారం. నవంబర్ 7వ తేదీ నామినేషనలు వేయడానికి ఆఖరి రోజు కనుక ఈలోపులే వివేక్ పార్టీ మారి తెరాస తరపున నామినేషన్ వేయవచ్చును.
కానీ దీని వలన తెరాసకు లాభం కంటే నష్టమే జరుగవచ్చును. ఆ పార్టీకి బలమయిన అభ్యర్ధి లేకపోతే అంతవరకు తను విమర్శిస్తున్న ప్రత్యర్ధ రాజకీయ పార్టీల నుంచే అభ్యర్ధులను వెతికిపట్టుకొని తెచ్చుకొని నిలబెడుతోందని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ విమర్శలు గుప్పించవచ్చును. మూడుసార్లు పార్టీలు మారిన వివేక్ ప్రజలను మెప్పించడం కూడా చాలా కష్టమే. కనుక తెరాస పార్టీ, ప్రభుత్వం ఆయనకు ఎంత మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన తన స్వంత బలం మీదనే ఈ ఎన్నికలలో గెలవలసి ఉంటుంది. తెదేపా, బీజేపీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలనుకొంటున్నాయి. కనుక ఆయన ఒంటరిగా ఆ రెండు పార్టీలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఆయన తమకు నమ్మకద్రోహం చేసారని కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలని, విమర్శలని ఎదుర్కొని ప్రజలను మెప్పించవలసి ఉంటుంది. ఇక తెరాసలో సీనియర్లను, టికెట్ ఆశిస్తున్న వారిని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ ని తీసుకువచ్చి టికెట్ ఇస్తే తెరాసలో అసమ్మతి మొదలవుతుంది. టికెట్ ఆశించి భంగపడినవారు ఆయనకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అదీగాక తెరాస ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధిని తెచ్చుకొని పోటీ చేయిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా ద్రువీకరించినట్లవుతుంది. కనుక తెరాస తన స్వంత అభ్యర్ధినే నిలబెడితేనే అన్ని విధాల పార్టీకి మేలు కలుగవచ్చును. దాని విజయావకాశాలు కూడా పెరిగి ఉండేవి. కానీ వివేక్ ని నిలబెట్టాలని ఇప్పటికే నిర్ణయం అయిపోయినట్లు తెలుస్తోంది కనుక ఈ పరిణామాలన్నీ తెదేపా-బీజేపీలకు కలిసి రావచ్చును.