రేటింగ్: 2.5/5
ముందు సినిమా చేయాలి. ఆ తర్వాత దాని వ్యాపారం గురించి… ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం గురించి ఆలోచించాలి. అలా కాకుండా సినిమా తీస్తున్నప్పుడే వ్యాపారం, ప్రచారంలాంటి లెక్కలు బుర్రలోకి ఎక్కాయో వ్యవహారం హడావుడిగా మారిపోతుంది. చేతిలో మంచి కథ ఉన్నా… అది నాణ్యంగా తెరపైకి రాకుండా పక్కదారి పట్టే అవకాశాలుంటాయి. అందుకు `గాలిసంపత్` సినిమా మరో ఉదాహరణగా నిలుస్తుంది. అదెలానో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం…
ఓ ప్రమాదం వల్ల మాటల్ని కోల్పోతాడు సంపత్ (రాజేంద్రప్రసాద్). ఫి ఫి అంటూ గాలితోనే మాట్లాడుతుంటాడు. ఆ భాషని అర్థమయ్యేలా చెప్పేందుకు పక్కన ఓ ట్రాన్స్‌లేటర్ (సత్య) ఉంటాడు. గాలి సంపత్‌కి కొడుకు సూరి (శ్రీవిష్ణు) అంటే ప్రాణం. తన జీవనోపాధి కోసం ఓ ట్రక్కుని కొనాలనేది సంపత్ కల. అందుకోసం తనలో ఉన్న నటన అనే కళ నుంచి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ డబ్బు సంపాదించకపోగా, కొడుకు సూరికి సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. అలా ఓసారి తండ్రీకొడుకుల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుంచి తండ్రి కనిపించడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని అందరూ అనుకుంటున్నా… గాలిసంపత్ మాత్రం ఇంటి పక్కనే ఉన్న నూతిలో ప్రమాదవశాత్తూ పడిపోతాడు. మరి మాటలేరాని సంపత్ అంత లోతున్న బావిలో నుంచి ఎలా బయటపడ్డాడో తెరపై చూసి తెలుసుకోవల్సిందే.
మంచి కాన్సెప్ట్ అయితే ఇందులో ఉంది. ప్రేక్షకుల్ని రక్తికట్టించే భావోద్వేగాలకి కావల్సినంత చోటు ఈ కథలో ఉంది. దాన్ని జాగ్రత్తగా తెరపైకి తీసుకురావల్సిన ఈ చిత్రబృందం హడావుడితో సినిమాని పూర్తిచేసేసినట్టు అనిపిస్తుంది. దాంతో ఎక్కడా బలమైన భావోద్వేగాలు పండించలేక ఓ మంచి కాన్సెప్ట్ వృథా అయిపోయిన అనుభూతిని మిగుల్చుతుంది. ప్రథమార్థంలోనైనా ఫిఫి ట్రాన్స్‌లేటర్ వల్ల అక్కడక్కడా నవ్వులు పండుతాయి కానీ… ద్వితీయార్థం అయితే ఏమాత్రం ఆసక్తిని పంచకుండా ముగుస్తుంది. నిజానికి ఇందులో కామెడీ లక్ష్యంగా చాలా పాత్రల్ని డిజైన్ చేశారు. జుట్టు కనిపించగానే జడ అల్లేయానుకునే సర్పంచ్ భార్య, ఇంటికి వచ్చిన కుర్రాడిని తన కొడుకులా ఫిక్స్ అయిపోయి తన భర్తతో సాయం చేయించే బ్యాంక్ మేనేజర్ భార్య, డ్రైవింగ్ చేస్తూ దారిని చూడకుండా దేవుడే కాపాడతాడంటూ విగ్రహాన్నే చూసే ఓ మూఢ భక్తుడు… ఇలా చిత్రమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి.
కానీ అవేవీ సినిమాపై ప్రభావం చూపించలేకపోయాయి. అనిల్ రావిపూడిలాంటి అగ్ర దర్శకుడు స్క్రీన్‌ప్లే సమకూర్చినా అది మరీ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్లో ఉండటంతో ఏ దశలోనూ ఆసక్తి లేకుండా సినిమా సాగుతుంది. ద్వితీయార్థంలో గొయ్యి నుంచి బయటపడే సన్నివేశాల్ని వాస్తవికతకి అద్దం పట్టేలా తీయాల్సి ఉండగా… ఆ సన్నివేశాల్ని మరీ నాసిరకంగా తెరకెక్కించడం సినిమాకి ప్రధాన మైనస్‌గా మారింది. అనిల్ రావిపూడి పేరుతో ప్రేక్షకుల్ని థియేటర్‌కి రాబట్టాలనుకోవడం… ఆయన పేరుంది కాబట్టి ప్రేక్షకులు ఆయన తరహా సినిమాని ఊహిస్తారేమో అని ముందే కథ చెప్పేయడం… తెలుగు ప్రేక్షకులకి ఇది కొత్త రకమైన కథ కాబట్టి వర్కవుట్ అవుతుందో లేదో అని ముందే జాగ్రత్తపడుతూ… పరిమితులు విధించుకుని హడావుడిగా సినిమాని పూర్తి చేయడం వంటి పనులు వెరసి ఈ కాన్సెప్ట్‌ని దెబ్బకొట్టాయి.
నటన పరంగా రాజేంద్రప్రసాద్ అనుభవం ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఫిఫి భాష మాట్లాడటం,విరామానికి ముందు నాటక సన్నివేశాలు, బావిలో పడ్డాక గొంతు నుంచి శబ్దం రాక పడిన సంఘర్షణ… ఇలా రాజేంద్రప్రసాద్ తన గాలిసంపత్ పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు. శ్రీవిష్ణు అలవాటైన పాత్రలోనే కనిపిస్తాడు. మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. హీరోయిన్ అందంగా కనిపించిందతే. సాంకేతికంగా కెమెరా, సంగీతం విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి.
అక్కడక్కడా కొన్ని నవ్వులు, తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలతో కొద్దివరకు కాలక్షేపాన్ని పంచుతుందీ చిత్రం. అంతకుమించిన అంచనాలతో వెళితే మాత్రం నిరాశపడక తప్పదు. కానీ హాలీవుడ్ సినిమాల్లో చూసే ఓ కొత్త రకమైన కాన్సెప్ట్‌ని మాత్రం తెలుగుకి పరిచయం చేసినట్టైంది గాలిసంపత్ బృందం.
రేటింగ్: 2.5/5