ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటి టాక్ ఎలా ఉన్నా, శివరాత్రి రోజున విడుదల కావడం ప్లస్ అయ్యింది. మూడు సినిమాలకూ టికెట్లు బాగానే తెగుతున్నాయి. అయితే… గాలి సంపత్, జాతిరత్నాలు సినిమాల మేకింగ్ చాలా లో క్వాలిటీలో ఉన్నాయన్న సంగతి ప్రేక్షకులు కనిపెట్టేశారు. గాలి సంపత్ కి దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత. జాతి రత్నాలు అయితే.. `మహానటి`, `ఎవడే సుబ్రహ్మణ్యం` తీసిన నాగ అశ్విన్ నిర్మాత. ఇద్దరూ.. మంచి దర్శకులే. కానీ నిర్మాతలుగా మారాక.. తమ పిసినారి తనం చూపించారు. నిజానికి తక్కువ బడ్జెట్ లో పూర్తయిపోయే కథలనే ఇద్దరూ ఎంచుకున్నారు. అలాంటప్పుడు కూడా… తెరపై క్వాలిటీ ఉండేలా జాగ్రత్త పడలేకపోయారు.చాలా సన్నివేశాల్ని.. అక్కడక్కడే తిప్పేసినట్టు కనిపించింది. `జాతిరత్నాలు`లో అయితే మరీనూ. లొకేషన్లు, కాస్ట్యూమ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ పిసినారి తనం చూపించారు. కాకపోతే… నిర్మాతలుగా ఇద్దరూ సక్సెసే. జాతి రత్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాలు గడించేశారు. గాలి సంపత్ దీ అదే తరహా. నిర్మాతలెవరికైనా సరే, తమ సినిమాలతో లాభాలు రావడమే అంతిమ ధ్యేయం. ఆ విషయంలో ఈ ఇద్దరు నిర్మాతలూ సక్సెస్ అయినట్టే.