Gaami Movie Review Telugu
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్
ఓటీటీలు వచ్చాక ప్రపంచం మరీ చిన్నదైపోయింది. సినిమా మరింతగా కుచించుకుపోయింది. ఆలోచనలు మాత్రం విస్తృతమయ్యాయి. విజువల్‌గా ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టడం కత్తిమీద సామే. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. కథ ఎలాంటిదైనా, విజువల్ గా మెస్మరైజ్ చేయాలి. పెద్ద కాన్వాస్ సృష్టించాలి. అప్పుడే ప్రేక్షకుల చూపు ఇటువైపు పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పేరు వినిపిస్తోందంటే కారణం.. కథల గొప్పదనం, దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంలో వచ్చిన నేర్పు. ‘గామి’ కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోదు. సెట్స్‌పై ఏళ్లకు ఏళ్లు నడిచిన సినిమా ఇది. కానీ… టీజర్, ట్రైలర్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మరి ఆ వెలుగులు వెండి తెరపై ఏ స్థాయిలో ప్రకాశించాయి?
శంకర్ (విశ్వక్సేన్) ఓ అఘోరా. తనకో విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా తనని తాకితే చర్మం రంగులు మారుతుంది. స్పృహతప్పి కింద పడిపోతాడు. దానికి విరుగుడు హిమాలయాల్లో దొరికే మాలిపత్రాల్లో ఉంది. 36 ఏళ్లకు ఓసారి మాత్రమే ఈ అరుదైన పుష్షాలు పూస్తాయి. వాటికి దక్కించుకోవడం కోసం శంకర్ హిమాలయాలకు పయనమవుతాడు. మరోవైపు ఓ యువకుడ్ని నిర్భంధించి, తనపై కొందరు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఆ జైలు గోడల నుంచి బయటపడడానికి అతను ఓ గుహ తవ్వడం మొదలెడతాడు. దీనికి సమాంతరంగా ఓ ఊర్లో ఉమ (హారిక) అనే ఓ చిన్నారిని దేవదాసిగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాన్నుంచి బయటపడేందుకు ఆ పాప శతవిధాలా ప్రయాస పడుతుంటుంది. ఈ మూడు కథలూ చివరికి ఏమయ్యాయో తెలుసుకోవాలంటే ‘గామి’ చూడాలి.
మూడు సమాంతర కథల సమ్మేళనం ‘గామి’. ఈ మూడు కథల్నీ దర్శకుడు ఎప్పడో ఓ చోట, ఏదో ఓ రూపంలో కలుపుతాడని ప్రేక్షకులకు ముందే తెలుసు. ఈ తరహా స్క్రీన్ ప్లే… ఇది వరకు కొన్ని సినిమాల్లో చూశాం. నిజానికి కేవలం ఆ స్క్రీన్ ప్లే ట్విస్టు కోసమే ఈ సినిమా తీస్తే… ‘గామి’ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మూడు కథల్లో ఉన్న సంఘర్షణే… ఈ కథకు మూలం. ఆసరా. శంకర్ స్పర్శకి దూరమైన ఓ జీవి. బాధల్లో ఉన్నప్పుడు స్నేహితుడు భుజం పై చేయి వేస్తే వచ్చే ఓదార్పు ఎలా ఉంటుందో శంకర్‌కి తెలీదు. స్వేచ్ఛకు దూరంగా.. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతున్న బాధితుడు మరోవైపు. చీకట్లో ఉన్నప్పుడే వెలుగు విలువ, ఒంటరిగా బతుకుతున్నప్పుడే తోటి మనిషి అవసరం అర్థం అవుతాయి. ఇక అభం శుభం తెలియని వయసులో దేవదాసిగా మారిపోవాల్సివచ్చినప్పుడు, ఆ ఆచారాల నుంచి పారిపోవాలన్న బలమైన ఆకాంక్ష.. ఓ చిన్నారిది. ఈ కథల్లో కావల్సినంత సంఘర్షణ ఉంది. అదే.. ‘గామి’కి ప్రేరణ.
ఈ కథని చెప్పడంలో దర్శకుడు విజువల్ సపోర్ట్ తీసుకొన్నాడు. శంకర్ కథని నడిపే సందర్భంలో వాడిన విజువల్స్ అద్భుతంగా కుదిరాయి. ఇంత తక్కువ బడ్జెట్లో, ఇంత క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. పైగా షూటింగ్ పరంగా చాలా డిలే అయిన సినిమా ఇది. అలాంటప్పుడు సీజీ వర్క్స్ మరింత తేలిపోతాయి. ఇది ఎప్పటి సినిమానో అనే విషయం అర్థమైపోతుంది. ఆ లోటుపాట్లేం తెరపై కనిపించలేదు. కాకపోతే ఇలాంటి కథల్లో స్లో నేరేషన్ భరించాల్సిందే. ఇదేం ఫార్ములా సినిమా కాదు. ఓ కామెడీ ట్రాక్ అతికించి, నవ్వులు పంచడానికి. ఆ సీరియస్‌నెస్.. స్లో నెస్ ఇలాంటి కథలకు పరిహరించలేని విషయాలు. క్లైమాక్స్ మరీ గొప్పగా లేకపోయినా, ఓకే అనిపిస్తుంది. ఇది వరకు ఇలాంటి ముగింపు, స్క్రీన్ ప్లే ట్విస్టు చూశాం కాబట్టి.. మరీ అంత థ్రిల్ ఏం ఇవ్వకపోవొచ్చు. కానీ ఓవరాల్‌గా ‘గామి’ కచ్చితంగా మంచి ప్రయత్నమే. విజువల్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా కొత్త తరహా అనుభూతే.
విశ్వక్సేన్ సినిమాలు ఎలా ఉంటాయో ఓ అవగాహనకు వచ్చేసి, అదే మైండ్ సెట్ తో థియేటర్‌కి వెళ్తే… తప్పకుండా షాక్‌కి గురవుతారు. తన పాత్ర, ఆ పాత్రని డిజైన్ చేసిన విధం అలా ఉన్నాయి. కంప్లీట్‌గా ఓ కొత్త విశ్వక్‌ని చూస్తారు. సినిమా అంతా ఒకేరకమైన మూడ్‌లో ఉండడం, దాన్ని చివరి వరకూ క్యారీ చేయడం సామాన్యమైన విషయం కాదు. చిన్నారి పాత్రలో హారిక నటన చాలా బాగుంది. చాందిని చౌదరి పాత్ర ఎందుకో అర్థం కాదు. బహుశా… ప్రేక్షకుల్ని స్క్రీన్ ప్లే విషయంలో మిస్ లీడ్ చేయడానికి ఆ పాత్రని వాడారనిపిస్తుంది.
టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్ లో ఉంది. కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కలరింగ్, థీమ్.. ఇవన్నీ కథలో మూడ్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. సంభాషణలు సహజంగా ఉన్నాయి. డ్రమటిక్ ఎక్స్ప్రెషన్స్ లేవు. దర్శకుడు చెప్పదలచుకొన్న విషయాన్ని తన స్క్రీన్ ప్లే టెక్నిక్‌తో చెబుతూనే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాడు. ఇలాంటి కథని పట్టాలెక్కించడంలో నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవాల్సిందే. కమర్షియల్ లెక్కలు పక్కన పెట్టి, క్వాలిటీకి పెద్ద పీట వేశారు. విశ్వక్ సేన్ ఇప్పటి వరకూ చేసిన సినిమాల మధ్య ‘గామి’ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరిన్ని కొత్త తరహా ప్రయత్నాలకు ప్రేరణ ఇస్తుంది.
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్