ఓ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తోందంటే… ఆ హంగామానే వేరు. గబ్బర్సింగ్కి సీక్వెల్గా సర్దార్ గబ్బర్ సింగ్ వస్తోందంటే.. అభిమానులు ఎంత సంతోషపడిపోయారు? ఆ సినిమాకి ఎంత హైప్ వచ్చింది? అయితే…. తెరపై బొమ్మపడ్డాక యావత్ పవన్ కల్యాణ్ అభిమానులూ చప్పున చల్లారిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకొంటే.. చివరికి యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాకొచ్చిన హైప్ దృష్ట్యా చూస్తే.. తొలి మూడు రోజులూ రికార్డు వసూళ్ల కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే.. గబ్బర్ సింగ్ పార్ట్ 3 కూడా రాబోతోందని సర్దార్లోనే చూచాయిగా చెప్పేశాడు పవన్ కల్యాణ్. రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ కార్డు కూడా సినిమా ఆఖర్లో వేశారు. దాంతో.. పార్ట్ 3కీ సిద్ధమైపోండన్న హెచ్చరికలు జారీ చేశాడు పవన్. ఇటీవల సంగీత దర్శకుడు డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా గబ్బర్ సింగ్ 3కి వస్తుందని సంకేతాలు ఇచ్చేశాడు. ప్రస్తుతం వస్తున్న టాక్ని బట్టి చూస్తే గబ్బర్ సింగ్ పార్ట్ 3 రాకపోవొచ్చు. కానీ పవన్ ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం కదా? మూడ్ మారి.. రాజా సర్దార్ గబ్బర్సింగ్ని పట్టాలెక్కించినా ఎక్కించొచ్చు. సో.. పవన్ ఫ్యాన్స్.. కాచుకోండిక…!