హైదరాబాద్: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ గట్టి షాకే ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీసీసీ నాయకులు తనకు మాటమాత్రమైనా చెప్పకుండా చంద్రశేఖర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని అన్నారు. కేటీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. కేసీఆర్ కూడా తనతో మాట్లాడారని తెలిపారు. త్వరలో టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు వెల్లడించారు.
ప్రసాద్ కుమార్ గుడిసెల వెంకటస్వామికి మేనల్లుడు… వివేక్, వినోద్లకు బావ. ప్రసాద్‌కు టీఆర్ఎస్లో తగిన గౌరవం ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. దీనితో రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కేటీఆర్ వ్యూహాలు పన్నినట్లు చెబుతున్నారు.