ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీకి రెడీ అని ప్రజా యుద్ధనౌక గద్దర్.. సమరోత్సాహంతో ప్రకటించారు. ఓట్ల ప్రజాస్వామ్యం మీద నమ్మకమే లేని ఆయన… ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. నమోదు చేసుకోలేదు కూడా. కానీ ఇటీవలే ఆయనకు ప్రజారాజకీయాల మీద గాలి మళ్లింది. ఎన్నికల్లో పోటీ చేస్తానని ఉత్సాహ పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ నిర్ణయించుకున్నారు. గద్దర్ సొంత ఊరైన తూప్రాన్.. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఉంది. అందువల్ల గజ్వేల్ కు తానే లోకల్ అని గద్దర్ చెబుతున్నారు.
70 ఏళ్ల జీవితంలో తొలిసారిగా ఓటు వేస్తున్న గద్దర్.. గత జులైలోనే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. నక్సలైట్ నాయకుడిగా బ్యాలెట్ ను వ్యతిరేకించినా.. ఆలస్యంగా పార్లమెంటరీ పంథాలోకి మళ్లడాన్ని సమర్థించుకున్నారు. ఇది యూ-టర్న్ కాదని, ముందుకెళ్లడమే అవుతుందన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తమ త్యాగాలు వృథా అయ్యాయయని, అందుకే ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వాలనుకుంటున్నానని చెబుతున్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు కేజీ టు పీజీ విద్య, అందరికీ ఆరోగ్యం, నిరుద్యోగులకు లక్ష కొలువులు వచ్చాయా? లేదా అనే అంశాలను వివరించడానికి ప్రజా చైతన్య యాత్ర చేస్తానంటున్నారు. అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా.. ఇండిపెండెంట్‌గా నిలబడతానని చెబుతున్నారు.
అయితే… గద్దర్ అభ్యర్థిత్వాన్ని ఇతర పార్టీలు అంగీకరిస్తాయా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే.. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరపున ఒంటేరు ప్రతాపరెడ్డి రంగంలో ఉన్నారు. ఈయన కొన్నాళ్ల కిందటి వరకు తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు చెమటలు పట్టించారు. కేసీఆర్ గజ్వేల్‌లో పోటీ చేయకపోతే.. ప్రతాపరెడ్డే గెలిచేవారని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు నేరుగా సీఎం హోదాలో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. తన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు కూడా మంజూరు చేయించారు. అయినా ప్రజాభిమానం తనకే ఉందని ప్రతాపరెడ్డి అంచనా వేసుకుంటున్నారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో.. ప్రతాపరెడ్డిని నిలబడెతుందో… నిలబడతానంటున్న గద్దర్‌కు చాన్స్ ఇస్తుందో.. వేచి చూడాలి..!