ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన మ్యాజిక్‌ను అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటారు. తన మాటలతో ఈ సారి గద్దర్ నే పోటీకి ఒప్పించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి అధికారికంగా ప్రకటించారు. కేఏ పాల్ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో కేఏ పాల్ యధావిధిగా తమ పార్టీ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో చెప్పుకొచ్చారు.
అయితే ఏ పార్టీ దొరకనట్లుగా.. గద్దర్‌కు కేఏ పాల్ పార్టీ నే దొరకిందా అని ఆయన గురించి .. తెలిసిన వాళ్లు జాలి పడుతున్నారు. ఒకప్పుడు ప్రజాయుద్ధనౌకగా పేరు తెచ్చుకుని ఇప్పుడు … ఓ సిద్ధాంతం అంట లేకుండా తిరుగుతున్న ఆయనను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రజా శాంతి పార్టీ స్థాయికి దిగజారిపోవడం ఆయనను అభిమానిస్తున్న వారిని కూడా కూడా ఆశ్చర్యపరిచింది. గద్దర ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్నది వారికి అంతు చిక్కకుండా ఉంది.
ప్రజాశాంతి పార్టీని చాలా మంది తేలికగా తీసుకుంటున్నారు. కానీ గద్దర్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. గట్టిగా పోటీ చేద్దామని.. ఏంతైనా ఖర్చు పెడదామని గద్దర్‌ను కేఏ పాల్ ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఎంత ఖర్చు పెడతారో కానీ.. మొత్తానికి పాల్ పార్టీకి మంచి అభ్యర్థి దొరికినట్లే.