మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత గాదె వెంకట రెడ్డి తెదేపాలో చేరేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే బేషరతుగా పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నాను. ఆయన నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పధంలో ముందుకు సాగుతోంది,” అని అన్నారు.
రాజధాని భూములు బినామీ కొనుగోళ్ళ వ్యవహారంలో వైకాపా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెదేపాకు ఆయన స్వాంతన కలిగించేవిధంగా మాట్లాడారు.”రాజధానిలో కేవలం తెదేపా వాళ్ళు మాత్రమే భూములు కొన్నట్లుగా వైకాపా ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అక్కడ అన్ని పార్టీలకు చెందిన నేతలు భూములు కొనుగోలు చేసారు. అయినా అందులో తప్పేముంది? రాజధానిలో ముందుగా భూములు కొనిపెట్టుకొని భూములకు కొరత సృష్టిస్తే తప్పు పట్టవచ్చును కానీ తమ అవసరాలకి భూములు కొనుకొంటే అందులో తప్పేమిటి? ఒకవేళ అది తప్పనుకొంటే న్యాయస్థానాలను ఆశ్రయించకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఏదేదో వ్రాయడం వలన ఏమి ప్రయోజనం ఆశిస్తున్నట్లు? ఒకవేళ వారి దగ్గర బలమయిన ఆధారాలున్నట్లయితే సిబీఐ విచారణ వేయమని ప్రభుత్వాన్ని ప్రాదేయపడటం దేనికి? వాటిని న్యాయస్థానానికి చూపిస్తే అదే సిబీఐ విచారణకు ఆదేశిస్తుంది కదా?అని గాదె వెంకట రెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి గాదె ఆవిధంగా మాట్లాడుతున్నారని అర్ధమవుతూనే ఉంది. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారంపై సిబీఐ విచారణ ఎందుకు అవసరం లేదు అని చెపుతున్నపుడు, తెదేపాలో చేరాలని ఆత్రం పడుతున్న గాదె సిబీఐ విచారణ ఏవిధంగా సాధ్యపడుతుందో వైకాపాకి సూచించడమెందుకో? అయినా 70ఏళ్ల వయసులో రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకోకుండా ఈ వయసులో తెదేపాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఎందుకు అనుకొంటున్నారో?