మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి రేపు (శుక్రవారం) గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. ఆయనతోబాటు ఆయన కుమారుడు మధుసూదన్ రెడ్డి, వారి అనుచరులు కూడా రేపు తెదేపాలో చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా బాపట్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను కాంగ్రెస్ పార్టీకి, ఎ.ఐ.సి.సి.సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతోనే తాము తెదేపాలో చేరాలనుకొంటున్నట్లు తెలిపారు. గాదె వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే కనీ ఇప్పటికే జీవచ్చవంలా మిగిలి ఉన్న దానికి కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదనే చెప్పవచ్చు. కానీ వారి చేరికతో గుంటూరు జిల్లాలో తెదేపా నేతల సంఖ్య ఇంకా పెరుగుతుంది. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడుతుందన్నట్లు, మున్ముందు పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం వారి మధ్య గొడవలు జరుగవచ్చు.