కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీలో రాబోయే కలకలానికి కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా.. నితిన్ గడ్కరీని ఆరెస్సెస్ ప్రమోట్ చేస్తోందని… కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఇటీవలి కాలంలో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉండే నాగపూర్ కేంద్రంగా కొన్ని వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరెస్సెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొంత మంది నేతలు.. మోడి,షాల నియంతృత్వ ధోరణులపై బహిరంగ విమర్శలు చేయడం ప్రారంభించారు. వారి వ్యవహారం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని… వారిని పక్కన పెట్టి.. గడ్కరీని అందలమెక్కించాలనేది.. ఆ డిమాండ్ల సారాంశం.
నిజానికి మోడీ, షాలకు వ్యతిరేకంగా.. గత నాలుగున్నరేళ్ల కాలంలో.. బీజేపీలో గొంతెత్తడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం.. అది కళ్ల ముందు కనిపిస్తోంది. అదే సమయంలో.. అలా విమర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. అందుకే.., మోడీ, షాలకు వ్యతిరేకంగా.. గడ్కరీని ప్రమోట్ చేస్తున్నది.. ఆరెస్సెస్నేనన్న ప్రచారం ఊపందుకుంటోంది. గడ్కరీ .. ఆరెస్సెస్ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు. మోడీ, అమిత్ షాలు జాతీయ రాజకీయాల్లోకి రాక ముందే… ఆయన బీజేపీకి అధ్యక్షునిగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి డొలాయమానంలోఉంది. మిత్రులు లేనిదే… ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. మోడీ ప్రధానిగా ఉంటే.. మిత్రులెవరూ రారు. అందుకే..మోడీకి బదులుగా గడ్కరీని ఆరెస్సెస్ ప్రమోట్ చేస్తుందన్నది బీజేపీలోని అంతర్గత వర్గాల సమాచారం.
నితిన్ గడ్కరీ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండే వ్యక్తి. ఆయన ప్రధాని పదవిపై.. తనకు ఎలాంటి ఆశలు లేవని చెబుతున్నారు. ఇంత వరకూ.. ఎక్కడా మోడీ, షాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. కానీ మొదటి సారిగా.. వైఫల్యాలకు.. నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిందేనని… వ్యాఖ్యనించి.. పరిస్థితులు మారుతున్నాయని నిరూపించారు.
ఓటమికి, విజయాలకు “నాయకత్వమే” బాధ్యత తీసుకోవాలని గడ్కరీ పుణెలోఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. గెలిచినప్పుడు… తమ ఘనతేనంటూ.. మోడీ, షాలు ర్యాలీలు నిర్వహించేవారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమి తర్వాత.. తమకు సంబంధం లేనట్లు వారు వ్యవహరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే.. గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గడ్కరీ వ్యాఖ్యలు బీజేపీలో ప్రారంభమైన మార్పుకి సంకేతమన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.