ఓ వైపు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అంటూ పాదయాత్ర చేస్తే అభివృద్ధి పనుల కోసం తెలంగాణకు వచ్చిన గడ్కరీ .. తెలంగాణ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. సంబంధం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులపై ఆయన పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాము క్లియరెన్స్ ఇవ్వడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని, హైదరాబాద్‌కు నీటి కష్టాలు తీరాయని ప్రకటించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నాటినుంచే కెసిఆర్ సర్కార్ కేవలం డబ్బులు దోచుకునేందుకు, కమీషన్లకు కక్కుర్తి పడే ఈ నిర్మాణాన్ని చేపడుతోందని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఎన్నోమార్లు ఈ విషయంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు కూడా ఇదే అంశాన్ని విమర్శనాస్త్రాలుగా పెట్టుకున్నాయి. కానీ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నింటికీ విలువ లేకుండా చేసేశారన్న అసంతృప్తి బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.
కేంద్రం నుంచి పెద్దలు వచ్చినప్పుడల్లా రాష్ట్ర బీజేపీకి టెన్షన్ ఏర్పడుతూనే ఉంది. అధికారిక పర్యటనకు వచ్చిన వారంతా టీఆర్ఎస్ సర్కార్‌ను పొగుడుతున్నారు. రాజకీయ పర్యటనకు వచ్చిన వారంతా టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇన్నిరోజులు పడిన కష్టం వృథా అవుతుందేమోననే భయం బీజేపీ శ్రేణులకు పట్టుకుంది. సహజంగా ఇలాంటి అవకాశాల్ని టీఆర్ఎస్ సోషల్ మీడియా అసలు వదులుకోదు. దానికి తగ్గట్లుగానే ప్రచారం చేసుకుంది. అభివృద్ధి రాష్ట్ర బీజేపీ నాయకులకే తెలియదని సెటైర్లు వేయడం ప్రారంభించారు.