జగన్మో హన్ రెడ్డిని ఓ సర్కిల్ లో ఉంచేసి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చక్కబెడుతున్న వ్యవహారం వైసీపీలో సంచలనం అవుతోంది. చాలా కాలంగా ఏదైనా సజ్జల ద్వారానే జగన్ కు చేరుతోంది. అంతా సజ్జల కోణంలోనే జరుగుతోంది ఆయన ఇప్పుడు పార్టీపై పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల పర్యటనకు వెళ్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు… భారీ ర్యారీలతో.
నియోజకవర్గాలకు సజ్జల – గజమాలలు తెస్తున్న ఎమ్మెల్యేలు
సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అంటే … ఎవరికీ తెలియదు. ఆయన జగన్ రెడ్డికి దగ్గర. ఆయన ఎంత చెబితే అంత జగన్ కు. ఏదైనా ఆయనే డిసైడ్ చేస్తారు. అంత వరకూ తెలుసు. ప్రభుత్వాన్ని కూడా ఒంటి చేత్తో ఆయన నడుపుతూంటారని అధికారవర్గాలకు తెలుసు. ఇప్పుడు ఆయన నేరుగా జనంలోకి వెళ్తున్నారు. తనకు బోలెడంత క్రేజ్ ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు . వారం, పది రోజులకు ఓ నియోజకవర్గానికి వెళ్లి హంగామా చేస్తున్నారు. రెండు, మూడు గంటలు భారీ ర్యాలీలు, గజమాలలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వ్యవహారం చూసి వైసీపీలో కలకలం రేపుతోంది.
జగన్ రెడ్డితో పాటు తానూ మాస్ లీడర్ గా నిరూపించుకోవాలనుకుంటున్నారా ?
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కేవలం అంతర్గత పనుల కోసమే ఉన్నారు. కానీ ఆయన తాను కూడా మాస్ లీడర్ ను అని నిరూపించుకోవాలన్నట్లుగా ఆరాటపడుతున్నారు. ఇందు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు… వైసీపీలో చర్చనీయాంశమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎలాగూ తన చుట్టూనే తిరుగుతున్నారు. తాను ఏం చెబితే అది చేస్తారు. అంతే కాదు వ్యూహాత్మకంగా ప్రభుత్వం తరపున పనులు కావాల్సిన వాళ్లు కూడా తన ఆఫీసు ముందు ధర్నాలకు ప్రోత్సహిస్తున్నారు. అంతా తన చుట్టూనే తిరుగుతోందన్న భావన కల్పిస్తున్నారు.
సోషల్ మీడియా కొడుకు గుప్పిట్లో – మొత్తంగా తేడా వ్యవహారమే !
ఇప్పటికే సోషల్ మీడియాను కొడుకు గుప్పిట్లో పెట్టారు. కొడుకు కూడా తన తండ్రితో పాటు తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకునేందుకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ను వాడుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని వీడియోలు .. సోషల్ మీడియా ఆఫీస్ నుంచి లీక్ చేస్తున్నారు. ఓ వైపు పార్టీని సజ్జల… సోషల్ మీడియాను ఆయన కుమారుడు కంట్రోల్ లో పెట్టుకున్నారు. జగన్ రెడ్డికి తాను ఎంత చెబితే అంత అన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు కాబట్టి… వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అయింది.
ప్రజలు రాజ్యాంగేతర శక్తుల్ని సహించరు. జగన్ రెడ్డిని ఆయన గ్రిప్ లో పెట్టుకుని ఉండవచ్చు కానీ… ప్రజలు ఆయనకు అధికారం ఇవ్వలేదు. ఆయన పెత్తనంపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పార్టీలోనూ అదే తిరుగుబాటు ఖాయంగా కనిపిస్తోంది. మరో లక్ష్మిపార్వతిలా వైసీపీ వినాశకంగా మారుతారన్న అభిప్రాయం మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.