తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. పెండింగ్ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ త్వరలో జరగాలని స్పష్టం చేశారు. ఐదో తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడటం.. పందొమ్మిదో తేదీన ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల టెండర్లను ఖరారు చేస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో…షెకావత్ లేఖ ఆసక్తి రేపుతోంది.
ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతోందని తెలంగాణ… తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతోందని ఏపీ అదే పనిగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఎప్పటి నుండో ప్రాజెక్టులు కట్టుకుంటోంది. అయితే.. ఏపీ మాత్రం..ఇప్పుడు కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టాలనుకుంటోంది. ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. దీన్ని తెలంగాణలో విపక్షాలు రాజకీయం చేస్తూండగా కేసీఆర్ మాత్రం… సైలెంట్‌గా.. ఆ ప్రాజెక్ట్ టెండర్లను నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేశారు.
అయితే.. ఏపీ సర్కార్… శ్రీశైలం నుంచి తమకు రావాల్సిన నీటినే తీసుకుంటామని… ఇందు కోసం… ఎత్తిపోతల కట్టుకుంటున్నామని ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదంటోంది. ఈ విషయాన్ని కేఆర్ఎంబీకి..అపెక్స్ కౌన్సిల్ లో చెప్పి అనుమతులు తీసుకుని రాయల్‌గా నిర్మాణం చేపట్టాల్సిన ప్రభుత్వం…పబ్లిసిటీ చేసుకుంటూ.. తెలంగాణలో సెంటిమెంట్ పెరగడానికి కారణం అవుతోంది. ఫలితంగా ప్రాజెక్ట్ చుట్టూ అనేక వివాదాలు ఏర్పడి… ఆపాలనే ఆదేశాలు.. వివిధ విభాగాల నుంచి వస్తున్నాయి.