గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమై… చర్చలు జరిపారు. రెండు వారాల కిందట.. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగినప్పుడు.. హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లి… మంతనాలు జరిపి.. టీఆర్ఎస్లోనే ఉండేలా ఒప్పించారు. అయితే హఠాత్తుగా ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. విజయశాంతి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరపినట్లు వెల్లడి కావడంతో.. టీఆర్ఎస్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో రేపో, మాపో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున… గజ్వేల్ నుంచి గెలిచిన నర్సారెడ్డి గత ఎన్నికల్లో నామినేషన్ కూడా వేశారు. అయితే అక్కడ… టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి బలంగా పోటీ ఇవ్వడంతో.. కేసీఆర్ తరపున బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు.. రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో రహస్య ఒప్పందం కుదిర్చుకుని.. ఆయన పోటీ నుంచి తప్పుకునేటట్లు చేశారు. కీలకమైన సమయంలో ఆయన ప్రచారం నిలిపివేసి.. తన క్యాడర్ మొత్తం టీఆర్ఎస్కు ఓట్లు వేసేలా చేశారు. దీంతో కేసీఆర్ 19,391 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పుడు 86,694 ఓట్లు కేసీఆర్ సాధించగా, 67,303 ఓట్లు ప్రతాప్రెడికి వచ్చాయి. నర్సారెడ్డికి 34,0 85ఓట్లు పోలయ్యాయి.
కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయనకు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇటీవలి కాలంలో … గజ్వేల్లో తనను టీఆర్ఎస్ నుంచి దూరం పెట్టారన్న భావనలో ఆయన ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే… టీఆర్ఎస్కు అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా.. టీఆర్ఎస్ నేతలు.. పార్టీలు మారుతున్నా… హరీష్ రావు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో అందర్నీ వరుసగా పార్టీలోకి తెచ్చిన ఆయన.. ఇప్పుడు వాళ్లంతా వెళ్లిపోతున్నా…లైట్ తీసుకుంటున్నారు.