కర్నాటక లోకాయుక్త ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని శుక్రవారం బెంగళూరులో అరెస్ట్ చేసారు. ఆయనకి చెందిన బ్లాక్ గోల్డ్ ఐరన్ ఓర్ మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీ అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తవ్వుకొని, ఎటువంటి అనుమతులు లేకుండా దానిని విదేశాలకు అమ్ముకొన్నందుకు అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీస్ ఐ.జి. కే.ఎస్.ఆర్.చరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు.
జనార్ధన్ రెడ్డి ఇంతకు ముందు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మూడేళ్ళ పాటు జైలులో ఉండి జనవరి 20న సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయటకు వచ్చేరు. మళ్ళీ ఏడాది తిరక్కుండానే జైల్లో వెళ్లి పడ్డారు. ఆయన కంపెని సుమారు 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి అమ్ముకొన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అంత భారీ స్థాయిలో ఇనుప ఖనిజం రవాణా చేయాలంటే రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు చాలా మంది సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఇంతవరకు ఒక్కరి పేరు కూడా బయటపడలేదు. ఆయనపై కేసులు పెడుతున్న అధికారులు ఈ అక్రమ ఇనుప ఖనిజ రవాణాలో ఆయనకి ఎవరెవరు తోడ్పడ్డారనే విషయంపై దృష్టి పెట్టకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.