‘గాలి జనార్ధన్ రెడ్డి’ కొత్తగా పరిచయం అవసరం లేని పేరిది. ఆ పేరు చెప్పగానే బళ్ళారి..ఓబులాపురం..అక్రమ గనుల త్రవ్వకాలు..ఆ కేసుల్లో ఆయన చాలా నెలలు జైలులో గడపడం..బెయిలో కోసం న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపడం..దానికి కక్కుర్తిపడ్డ ఆ న్యాయమూర్తి పరువు రోడ్డున పడటం…తరువాత కొందరు డిల్లీ పెద్దల చలువతో జైలు నుంచి బయటపడటం వగైరా సీన్లన్నీ గిరగిరా మన కళ్ళ ముందు తిరుగుతాయి. అలాగే ‘ఆయనెవరో నాకు తెలియదు’ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు కూడా లీలగా చెవులకి సోకుతాయి.
ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, ప్రముఖ ఆంగ్లదిన పత్రిక ‘డెక్కన్ క్రానికల్’ ఈరోజు సంచికలో వారిరువుగురించి ఒక ఆసక్తికరమయిన కధనం ప్రచురించింది. అదేమిటంటే, తెదేపా ఆకర్షణకిలోనయి వైకాపా వీడుతున్న ఎమ్మెల్యేలందరికీ గాలి జనార్ధన్ రెడ్డి అభయహస్తం ఇచ్చేరుట! ముఖ్యంగా రాయలసీమకి చెందిన వైకాపా ఎమ్మెల్యేలందరూ పార్టీలోనే కొనసాగినట్లయితే వారి ‘బాగోగులు’ అన్నీ తనే చూసుకొంటానని హామీ ఇచ్చినట్లు దానిలో పేర్కొంది. ఆ బాగోగులు ఏమిటో అందరికీ తెలుసు. అది ఎంత ఖరీదో కూడా అందరికీ తెలుసు.
గాలి జనార్ధన్ రెడ్డికి నమ్మిన బంటుగా చెప్పబడే కర్నాటక ఎమ్మెల్యే బి.శ్రీరాములు రాయలసీమకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలందరితో మాట్లాడుతున్నారని, వారు వైకాపాలోనే కొనసాగాలని కోరుతున్నట్లు ఆ పత్రిక కధనంలో పేర్కొంది. వైకాపాకు రాయలసీమలోనే 25 మంది ఎమ్మెల్యేలున్నారు. వారు కనుక పార్టీ నుంచి జారీపోతే ఇంకా వైకాపా మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుంది. వైకాపాను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో రాయలసీమ జిల్లాలలోని వైకాపాకు చెందిన ఎస్సి, ఎస్టీ ఎమ్మెల్యేలపై తెదేపా దృష్టి పెట్టడంతో, వారు పార్టీ నుంచి జారిపోకుండా కాపాడేందుకు గాలి జనార్ధన్ రెడ్డి రంగంలోకి దిగారని ఆ పత్రిక కధనంలో పేర్కొంది. అదే నిజమయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెదేపాను ఉద్దేశ్యించి అన్నమాటలు వెనక్కి తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పడు గాలి జనార్ధన్ రెడ్డి సంపాదించిన అవినీతి సొమ్ముతోనే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొంటున్నట్లవుతుంది. అలాగే గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోవలసి ఉంటుంది.