గాలి జనార్థనరెడ్డి… ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది మైనింగ్ మాఫియా కేసు! గనుల అక్రమ తవ్వకాల్లో ఆయన అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. గాలి రాజకీయ జీవితానికి దాదాపు ఫుల్ స్టాప్ పడిపోయిందనే చెప్పొచ్చు! అయితే, తన సేవలు పార్టీకి అందుబాటులోనే ఉంటాయని చెబుతున్నారు. బళ్లారిలో తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో గాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి తాను ఎప్పుడూ విధేయుడుగానే ఉంటాననీ, పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానా లేదా అనే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అభివృద్ధికి పాటు పడతానన్నారు.
కర్ణాటకలో మరోసారి భాజపా అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తానని గాలి చెప్పారు. అంతేకాదు, ఆంధ్రా, తెలంగాణల్లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చేలా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు మంచి గుర్తింపు ఉందనీ, రాజకీయంగా మంచి పరిచయాలే ఉన్నాయనీ, అవసరం అనుకుంటే పార్టీ తరఫున ప్రచారానికి కూడా వెళతానని కూడా గాలి చెప్పారు. 2018 ఎన్నికల్లో కర్ణాటకలో భాజపా అధికారంలోకి వస్తుందనీ, అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా అవుతారని జోస్యం చెప్పారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం గాలి జనార్థన్ రెడ్డి రహస్య అజెండా మరొకటి ఉందట! అదేంటే, తన భాగస్వామి, చిరకాల మిత్రుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డిని ఎన్డీయేకి చేరువ చేయడం! 2019 లోక్ సభ ఎన్నికల నాటికి వైకాపాని భాజపా మిత్ర పక్షంగా మార్చేందుకు గాలి కృషి చేస్తున్నట్టు సమాచారం. వైయస్ హయాంలో గాలి జనార్థన్ రెడ్డికి ఏపీలో ఏ స్థాయి ప్రాధాన్యత దక్కేదో అందరికీ తెలిసిందే. ఏపీ సర్కారు నుంచి అప్పట్లో భారీ ఎత్తున లబ్ధి పొందినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వైయస్ మరణం, మైనింగ్ కేసు వెలుగులోకి రావడం నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డి ప్రాభవం క్రమంగా తగ్గింది. కానీ, జగన్ తో తత్సంబంధాలు ఉన్నాయనే అంటారు. అందుకే, వైకాపాని భాజపాకు దగ్గర చేసేందుకు గాలి పావులు కదుపుతున్నారని అంటున్నారు.
అయితే, రాజకీయాల్లో మరోసారి క్రియాశీలంగా మారేందుకు గాలి సిద్ధంగా ఉన్నా… భాజపా అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చర్చనీయాంశం. ఎందుకంటే, గాలిని మళ్లీ అక్కున చేర్చుకుని, ప్రాధాన్యత ఇస్తే భాజపా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయనపై కేసులున్నాయి కదా! అలాగని… గాలి సేవల్ని మరోలా వినియోగించుకునే అవకాశం లేదని కూడా చెప్పలేం. సో.. తెర వెనక నుంచి ఆయన సేవల్ని వాడుకునే అవకాశం ఉంటుంది కదా! మరి, ఆ మార్గంలో వైకాపా, భాజపాల మధ్య ఫ్రెండ్ షిప్ పెంచేందుకు గాలి ఎలాంటి ప్రయత్నం చేస్తారో వేచి చూడాలి.