కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారు. దాని పేరు కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. తాను కొప్పల్ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆయన పరోక్షంగా అయినా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ ఆయనను బీజేపీ పట్టించుకోవడం లేదు. ఆయన ఆత్మీయుడు శ్రీరాములుకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ రాను రాను గాలి వర్గానికి ప్రాధాన్యత తగ్గిపోతూండటంతో ఆలోచించి.. సొంత పార్టీ నిర్ణయం తీసుకున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టడం వల్ల హైదరాబాద్ కర్ణాటకగా పేరు పొందిన ప్రాంతంలో బీజేపీ బాగా నష్టపోనుంది. బళ్లారితో పాటు ఆ చుట్టుపక్కల జిల్లాల్లో గాలి జనార్ధన్ రెడ్డికి పట్టు ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి చాలా కాలం అయినప్పటికీ.. ఆయన తన వర్గాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంత క్లిష్టపరిస్థితులు ఎదురైనా ఆయన తన రిచ్ నెస్ ను మాత్రం చూపించకుండా ఉండరు. ఈ కారణంగా అనచరులు కూడా ఆయనను వీడి వెళ్లడం లేదు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ హైకమాండ్ నుంచి స్పందన కనిపించలేదు. ఇప్పుడు విడిగా పోటీకే సిద్ధమయ్యారు. బీజేపీలోని ఆయన ఆత్మీయులు ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి వెంట వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ నష్టపోతుంది. ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ లాభపడనుంది. ప్రస్తుతం బీజేపీ తీవ్రమైన అధికార వ్యతిరేకతను కర్ణాటకలో ఎదుర్కొంటోంది.
గాలి జనార్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు హైదరాబాద్ కోర్టులో రోజువారీ జరుగుతున్నాయి. బెయిల్ కోసం జడ్జికి వంద కోట్లు ఇచ్చిన వ్యవహారంలోనూ కేసు విచారణ జరుగుతోంది. ఇలాంటి టెన్షన్లు ఏమీ పెట్టుకోకుండా జనార్ధన్ రెడ్డి.. తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు.