కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణదీక్ష ఆరో రోజుకు చేరడంతో.. కేంద్రంలో కొంచెం కదలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఎంపీ, ఎమ్మెల్సీల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అయితే అనూహ్యంగా ఢిల్లీలోని బీజేపీ వర్గాలు .. కడపలో ప్రైవేటు సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉందనే ప్రచారాన్ని మెల్లగా ప్రజల్లోకి పంపడం ప్రారంభించాయి. ముందుగా ఈ తరహా సమాచారం… టీడీపీ నేతలకు అందింది. దీనిపై కేంద్రం వ్యూహం ఏమిటో పూర్తిగా అర్థం కాక ముందే… గాలి జనార్ధన్ రెడ్డి.. బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ ను మళ్లీ తనకు అప్పగిస్తే.. రెండేళ్లలో ఉత్పత్తి మొదలు పెడతామని ప్రకటించారు. లేకపోతే.. ప్రభుత్వమే పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చని… కానీ తన ప్లాంట్ పై పెట్టిన ఖర్చు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు లేఖలు రాస్తానని కూడా ప్రకటించారు.
ఓ వైపు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా కడపలో ఉక్కు పరిశ్రమ కోసం .. ఆందోళన జరుగుతూండగా.. గాలి జనార్దన్ రెడ్డి.. తానే పెడతానంటూ ముందుకు రావడంతో… టీడీపీ నేతల్లో .. కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. గాలి జనార్ధన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ అప్పగించాడనికి బీజేపీ, వైసీపీ కలసి కుట్ర చేస్తున్నాయని… ఏపీ భారీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ రెడ్డి… నేరుగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా… గాలి జనార్ధన్ రెడ్డికో..మరో ప్రైవేటు సంస్థతోనే స్టీల్ ప్లాంట్ పెట్టించాలనుకుంటే..చట్టంతో పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. సెయిల్‌తో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయిస్తామని చట్టంలో ఉంది కాబట్టే..ఏపీ డిమాండ్ చేస్తోందన్నారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డికి… వైఎస్ హయాంలో దాదాపుగా పదకొండు వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి చుట్టూ ప్రహారీ కట్టుకోవడానికే గాలి జనార్ధన్ రెడ్డి ఏళ్ల సమయం తీసుకున్నారు. లోపు వైఎస్ మరణించడంతో… గాలి జనార్ధన్ రెడ్డికి కూడా.. ఆదాయ వనరులు పడిపోయాయి. మైనింగ్ కేసుల్లో ఇరుక్కోవడంతో ఉక్కు పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏళ్ల తరబడి కదలిక లేకపోవడంతో… కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. అసలు భూముల కేటాయింపు, స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో గనుల అక్రమ కేటాయింపు లాంటి అంశాల్లో అప్పట్లో వైఎస్ ప్రభుత్వంపై చాలా ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారం అక్కడితో ముగిసినట్లయింది.
అనూహ్యంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో.. గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం తెరపైకి రావడంతో.. రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎందుకంటే.. గాలి జనార్దన్ రెడ్డి… ప్రస్తుతం బీజేపీలో ప్రత్యక్షంగా లేకపోయినా … ఆ పార్టీకి కీలక నేత. గత ఎన్నికల్లో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఎమ్మెల్యేల బేరసారాల్లోనూ బయటపడ్డారు. ఇప్పుడు గాలికి అత్యంత ఆప్తుడయిన జగన్ కూడా.. బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు. ఈ కారణాలతో… స్టీల్ ప్లాంట్ ను.. గాలికి కట్టబెట్టాలనే ఆలోచన బీజేపీ చేస్తోందన్న అనుమానాలు టీడీపీలో ప్రారంభమయ్యాయి.