కర్ణాటక భారతీయ జనతా పార్టీ అజ్ఞాత నాయకుడు, మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. బళ్లారి ఉపఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థి ఘోర పరాజయం పాలవుతున్న సందర్భంలోనే ఆయన తలదాచుకోవడానికి పరారయ్యారు. అయితే.. ఓటమి అవమానంతో తల ఎవరికీ చూపించలేక కాదు.. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో. గాలి జనార్ధన్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడానికి కారణం.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులతో.. కలిసి… కేసుల మాఫీ చేయడానికి ప్రయత్నించడం. ఈ వ్యవహారం బయటకు రావడంతో.. గాలి జనార్ధన్ రెడ్డి పరారయ్యారు.
కర్ణాటకలో కొన్నాళ్ల క్రితం.. యాంబిడెంట్ మార్కెంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ… వ్యవహారం రచ్చ అయింది. పోంజీ స్కీములు నడిపి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. మనీ లాండరింగ్‌కు పాల్పడటంతో.. ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ యాంబిడెంట్ కంపెనీ.. గాలి జనార్దన్ రెడ్డి వద్దకు వచ్చింది. ఆయన ఈడీ కేసులు తీసేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ప్రతిగా తనకు డబ్బులు వద్దని చెప్పారు కానీ 57 కిలోల బంగారు కడ్డీలు మాత్రం తీసుకున్నారు. ఈడీ అధికారులకు… రూ. కోటి లంచం ఇచ్చారు. అయితే.. ఇది బయటపడిపోయింది. ఈ విషయం సాక్ష్యాలతో సహా… యాంబిడెంట్ కంపెనీలో సోదాలు చేసిన అధికారులకు దొరికిపోవడంతో.. గాలి జనార్ధన్ రెడ్డి కోసం.. వేట ప్రారంభించారు. ఈ విషయం తెలిసి ఆయన పరారయ్యారు.
అక్రమ మైనింగ్‌తో వేల కోట్లు సంపాదించిన గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన.. ఈడీ అధికారులకు లంచాలిచ్చి .. కేసులు కొట్టి వేయించేలా.. సైడ్ బిజినెస్ ప్రారంభించడం… కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి.. తెలిసింది.. ఇక ముసుగులో ఎన్ని జరిగాయో తేలాల్సి ఉంది. ఇప్పటికే.. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏకంగా గాలి జనార్ధన్ రెడ్డితో కలిసి.. ఈడీ అధికారులు.. కేసుల మాఫీ సైడ్ బిజినెస్ ప్రారంభించడం… దేశవ్యాప్తంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.