మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి దేన్నైనా డబ్బుతో కొనొచ్చనుకుంటారు. గతంలో గనుల కేసులో.. సీబీఐ కోర్టులో బెయిల్ కోసం.. న్యాయమూర్తికి లంచం ఇచ్చి.. అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే డబ్బులు ఎర చూపినట్లు.. కర్ణాటక ఎన్నికల సమయంలో… కొన్ని వీడియోలు సర్క్యూలేట్ అయ్యాయి. ఇప్పుడు ఈడీ అధికారులతో కేసులు మాఫీ చేయించేందుకు తనే స్వయంగా బేరం కుదుర్చుకున్న ఘటన బయటకు వచ్చింది. అసలు గాలి జనార్దన్ రెడ్డి.. తన అక్రమ మైనింగ్ ను.. అలా నిరాటంకంగా కొనసాగించగలగడానికి కారణం.. ఈ తరహాలో మనషుల్ని కొనేయడమేనని.. చాలా మందికి తెలుసు. అయితే ఇదే అస్త్రాన్ని ఏకంగా న్యాయమూర్తుల మీదే ప్రయోగిస్తారని మాత్రం ఊహించలేకపోయారు. అధికారులు, రాజకీయ నేతలకు ఇలా డబ్బులు ఆశ పెట్టరాంటే అర్థం ఉంది కానీ.. న్యాయమూర్తులు, ఈడీ, సీబీఐ లాంటి అధికారులకు కూడా…లంచాల ఎర వేయడం కలకలం రేపేదే.
పోంజి స్కీములు నడిపి.. వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఈడీ కేసుల్ని తప్పించుకోవడానికి గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ప్రయత్నించడం.. ఏమిటన్న సందేహం చాలా మందికి వస్తుంది. అసలు.. ఈడీకి.. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం ఏమిటి..? సంబంధం ఏమీ ఉండదు.. ఈడీ అధికారులకు నోట్ల కట్టలు ఎర వేయడంలో తన స్కిల్స్‌ను అలా వాడుకుంటున్నారన్నమాట. మైనింగ్ ఆగిపోయిన తర్వాత, సీబీఐ ఆస్తులన్నీ సీజ్ చేసేసిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి విలాసానికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో .. ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసిందన్నమాట. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరుడు అలీఖాన్ కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నట్లు… ఫోన్ ట్రేసింగ్ ద్వారా తెలుసుకున్న కర్ణాటక పోలీసులు హైదరాబాద్‌లో గాలింపు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గాలి జనార్దన్ రెడ్డికి చాలా మంది ఆత్మీయులున్నారు. ఎవరి దగ్గర అయినా ఆశ్రయం పొందవచ్చు.
గాలి జనార్ధన్ రెడ్డికి.. ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకపోతే పారిపోవాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆయన పారిపోయారు. ఆయన అనుంగు అనుచరుడు .. బి.శ్రీరాములు మాత్రం…ఆయన ఎక్కడికి పారిపోయాడో తెలియదని.. చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే.. గాలి జనార్దన్ రెడ్డి మరోసారి జైలు తిండి తినక తప్పని పరిస్తితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే.. పోలీసుల నుంచి తప్పించుకుని గాలి జనార్దన్ రెడ్డి.. ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉండగలరు. దేశం దాటి పోలేరు పాస్ పోర్ట్ కోర్టు ఆధీనంలో ఉంది. ఎంత కాలం దాక్కున్నా.. దాని వల్ల మరింత చెడ్డ పేరే కానీ… తప్పించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. పరారీలో ఉంటే.. కోర్టులు ముందస్తు బెయిళ్లు కూడా ఇవ్వడం కష్టమే.