బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మూడు రోజుల నుంచి వెదుకుతూంటే.. ఫోన్లు సహా అన్నీ స్విచ్చాఫ్ చేసుకున్న ఎవరికీ కనిపించకుండా పోయిన గాలి జనార్ధన్ రెడ్డి హఠాత్తుగా… బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయలో ప్రత్యక్షమయ్యారు. తనకు నోటీసులు అందాయని.. అందుకే వచ్చానని చెప్పుకొచ్చారు. విచారణకు సహకరిస్తానని పోలీసులకు తెలిపారు. అంతకు ముందు… తన లాయర్ తో కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని… తనకు నిన్ననే పోలీసుల నోటీసులు అందాయని చెప్పుకొచ్చారు. అందుకే ఈ రోజు విచారణకు హాజరయ్యానన్నారు. నేనెక్కడికీ పారిపోలేదు, బెంగళూరులోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మీడియా ద్వారా అన్నీ తెలుసుకుంటున్నారన్నారు.
యాంబిడెంట్ అనే గొలుసుకట్టు వ్యాపార సంస్థ ప్రజల వద్ద నుంచి రూ. ఆరు వందల కోట్లు వసూలు చేసి… ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు… గాలి జనార్దన్ రెడ్డిని ఆశ్రయించింది. 57 కేజీల బంగారు కడ్డీలు. రూ. రెండు కోట్ల నగదు తీసుకుని… ఈడీ కేసులు లేకుండా చేస్తానని.. గాలి హామీ ఇచ్చారు. ఓ కోటి రూపాయలను.. ఈడీ అధికారికి ఇచ్చినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి డీలింగ్స్ మొత్తాన్ని… సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సేకరించారు. చివరికి..ఓ స్టార్ హోటల్ లో యాంబిడెంట్ కంపెనీ ఓనర్, గాలి జనార్దన్ రెడ్డి భేటీ అయిన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలను కూడా.. స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అలీఖాన్ అనే గాలి పీఏనే కీలకం. ఆయనే… గాలి తరపున బంగారు కడ్డీలు, నగదు తీసుకున్నారు.
అయితే ఈ అలీఖాన్.. పోలీసుల ఎదుట లొంగిపోలేదు. అలీఖాన్ తో కలిసి పరారీలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి.. ఒక్కడే వచ్చి.. బెంగళూరులో లొంగిపోవడం వెనుక వ్యూహం ఉందని భావిస్తున్నారు. అలీఖాన్ దొరికితే అసలు విషయాలు బయటకు వస్తాయి. పైగా ఇంత జరుగుతున్నా.. గాలి జనార్ధన్ రెడ్డి దేశం విడిచి పరారయ్యారని వార్తలు వచ్చినా… బయటకు రాని గాలి జనార్ధన్ రెడ్డి హఠాత్తుగా సీసీబీ పోలీసుల ఎదుట హాజరై… తాను అన్నీ తెలుసుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అన్ీ తెలుసుకుంటే.. తనకేం సంబంధం లేకపోతే.. మూడు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ఎందుకు పరారీలో ఉండటం అన్న అనుమానాలు సహజంగానే వస్తున్నాయి.