కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న గాలి జనార్ధన్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగువాళ్లు అత్యధికంగా ఉండే గంగావతి నియోజవకర్గం నుంచి ఎనిమిదివేల ఓట్ల మెజార్టీ గెలిచాడు. అక్కడ బీజేపీ మూడో స్థానంలో ఉంది. అయితే గాలి జనార్ధన్ రెడ్డి ఆత్మీయులందరూ ఓడిపోయారు. కంచుకోట బళ్లారి నుంచి పోటీ చేసిన భార్య లక్ష్మి కరుణ కూడా పరాజయం పాలయ్యారు. ఇక తన పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులెవరూ గెలవలేదు.
ఇక ఆయనకు అత్యంత ఆత్మీయులు, బంధువులు అయినప్పటికీ ఆయన పార్టీలో చేరకుండా బీజేపీ తరపునే పోటీ చేసి ఓడిపోయారు మరికొందరు. ఈ ఓటముల్లో గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల పాత్ర కూడా ఉంది. గాలి జనార్ధన్ రెడ్డి తన కుటుంబసభ్యుడిలా చూసుకునే బి.శ్రీరాములు రాష్ట్ర మంత్రిగా ఉంటూ బళ్లారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఆయతే ఆయన అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యారు. భారీ తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గంలో తిరుగులేని పట్టు ఉందనుకున్నఆయన అంత ఘోరంగా ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. అలాగే గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా బీజేపీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఆత్మీయులు అందర్నీ ఓడించేసిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి ఒక్కరే అసెంబ్లీకి వెళ్తున్నారు. బీజేపీకి అహంకారం పెరిగిపోయిందని సిద్దరాయ్యను సీఎం ను చేస్తే కాంగ్రెస్ కు మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతు తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య.. గాలి, జగన్ ఇద్దర్నీ కలిపి విమర్శించారు. ఇద్దరూ అవినీతి పరులన్నారు. కొసమెరుపేమిటంటే.. గాలి పార్టీ రంగులు.. స్ట్రాటజీ మొత్తం వైసీపీదే.