తుని విద్వంసానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే కుట్రపన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం అందరికీ తెలుసు. తెదేపా నేతలు, మంత్రులు కూడా వైకాపాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెదేపా ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా తీవ్ర ఆరోపణలు చేసారు. అతనే తన రాయల్ పార్క్ హోటల్లో తన అనుచరులతో సమావేశమయ్యి ఈ కుట్రకు ప్లాన్ చేసారని ఆరోపించారు. వైకాపా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మధ్య కులాల చిచ్చుపెట్టడం చాలా దారుణమయిన విషయమని ఆయన అన్నారు. తుని ఘటనలకు బాధ్యులయిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. తమ ప్రభుత్వం కాపులకు, బీసీలకు ఎవరికీ అన్యాయం చేయాలని ఎన్నడూ భావించలేదని, అందరినీ సమానంగానే చూస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా బీసీలకు నష్టం జరుగకుండా కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే జస్టిస్ మంజూనాద కమీషన్ ఏర్పాటు చేసామని తెలిపారు.
తుని ఘటనలో దోషులు ఎవరో కనుగొనేందుకు సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు ఈ కుట్రను ఎవరు పన్నారో, ఎక్కడ పన్నారో వంటి వివరాలను మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం కంటే సిఐడి పోలీసులకే తెలియజేస్తే బాగుండేది కదా?