అవినీతి చేయాలి కానీ ఎవ్వరూ విమర్శలు చేయకూడదు, అక్రమాలు చేయాలి కానీ చట్టానికి అస్సలు దొరకకూడదు….అదీ మన నాయకుల స్టైల్. ఇప్పుడు శ్రీ గాలి జనార్థన్రెడ్డిగారు… పెళ్ళి విషయంలో కూడా ఇలాంటి పద్ధతినే ఫాలో అవుతున్నట్టున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి పెళ్ళి కార్డుల్లోనే సినిమా రేంజ్ వీడియో చూపించిన గాలివారి వివాహ బ్రహ్మోత్సవంపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. భాషతో, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా గాలిగారి ఆడంబరానికి హాశ్ఛర్యపోయి హతాశురాలైంది. తమ స్టైల్లో ఉతికి ఆరేసింది. అసలే బోలెడన్ని అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కుని ఉండడం, ఆపై కోర్టు కేసులు కూడా ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పడానికి గాలిగారి ప్రతినిధులు రెడీ అయిపోయారు. పెళ్ళికి పెద్దగా ఖర్చు చేసే ఉద్ధేశ్యం లేదని చెప్పారు. తమ స్థాయికి తగ్గట్టుగా మధ్య తరగతి స్థాయిలోనే వివాహం జరుగుతుందని గాలి ప్రతినిధులు చెప్పారు.
హన్నన్నా…….గాలిగారిది మధ్య తరగతి ఏంది? బంగారు సింహాసనం కూడా లేని కడు పేదవారు కదా ఆయన. కాకపోతే అన్నా…మీ వివరణలోనే కొన్ని తప్పులు ఉన్నాయన్నాయ్. మధ్య తరగతి స్థాయిలో పెళ్ళి చేస్తాం అనడం వరకూ ఒకె… కానీ ఆ తర్వాతే తప్పులు మాట్లాడేసి దొరికిపోయారు. వివాహ ఆహ్వాన పత్రికను అధునాతన పరిజ్ఙానంతో చేశామని చెప్పారు, పెళ్ళికి జాతీయ నేతలను కూడా ఆహ్వానిస్తున్నామని మీరే చెప్పారు….. ఇక వీడియోలో హంగామా, మీ పెళ్ళి ఏర్పాట్ల హంగామా చూస్తుంటే… భారతదేశంలో ఉన్న ఏ మధ్య తరగతి ఇంటి పెళ్ళి… ఈ స్థాయిలో జరుగుతుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి గాలిగారు. ఓహో…..మీరు రాజకీయ నాయకులు కదా? మరిచేపోయాను గాలిగారు. ఎన్నికల సమయంలో ఏ కహానీలు చెప్పినా విన్నారు, ఏం హామిలిచ్చినా నమ్మేసి ఓట్లు గుద్దేశారు…. ఇఫ్పుడు మాత్రం ఈ లాజిక్కులు ఎందుకు? చెప్పింది ఇనండెహే అనే సిద్ధాంతం కదా మన నాయకులది. అయితే మీరే కరెక్ట్ గాలిగారు. అయినా ఒక్క సందేహం మాత్రం వస్తోంది. మీ బంగారు సింహాసనాలు, హెలికాప్టర్ వ్యవహారాలు, బ్లాక్ మనీ వ్యవహారాలు…..అందరికీ తెలిసిపోయినయి కదా? ఇంకా ఎందుకు ఈ బొంకుడు వ్యవహారాలు? యస్…..నా కూతురి పెళ్ళి…. కోట్లలో ఖర్చు పెట్టి అంగరంగ వైభోగంగా చేసేస్తా. డబ్బులు ఎలా సంపాదిస్తే మాత్రం ఏంటి? అది కూడా కష్టపడినా సొమ్మే కదా? ఆ సొమ్ము నా కూతురు సంతోషం కోసం, నా బల ప్రదర్శన, హోదా చూపించుకోవడానికి ఖర్చుపెట్టకపోతే ఇక ఏం చేసుకోవాలి? అని ఘాఠ్ఠిగా గర్జిస్తూ ఓ ఎదురు ప్రశ్న వేసేయండి. ఎవరు మాట్లాడతారో చూద్దాం. అయినా మీకు తెలుసో తెలియదో….కోట్లలో ఖర్చు పెట్టి మరీ మీరు ప్రదర్శిస్తున్న పెళ్ళి వైభోగం చూసి…మీరు చానా గొప్పవాళ్ళు అయి ఉంటారనుకుని కూడా ఓట్లు గుద్దేసే అమాయకులు మన దగ్గర చాలా మందే ఉన్నారు. డౌట్స్ ఏం పెట్టుకోకండి…. అప్పుడెప్పుడో…ఆ కాలంలోనే బంగారు సింహాసనం చేయించుకున్న మీ వైభోగానికి ఏ మాత్రం తగ్గకుండా అంగరంగ వైభోగంగా పెళ్ళి చేసేయండి. ఇంకా మీకు అనుంగు మిత్రులైన ఆ రిటైర్డ్ జడ్జ్గారితో పాటు.. ఇంకా చాలా మంది ఉన్నారుగా…..వాళ్ళను కూడా పిలవండి. అందరూ కలిసి ఓ బ్రహ్మాండమైన ఫొటో కూడా దిగి మీడియాకు వదలండి. ఎవరు మాట్లాడతారో చూద్దాం.