గల్లా అరుణ కుమారి.. కాంగ్రెస్ హయాంలో మంత్రి. చిత్తూరు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాంగ్రెస్ లో వైఎస్ కు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి సాన్నిహిత నేతగా పేరు తెచ్చుకున్నారామె. అలాగని ఆమెకు తెలుగుదేశం పార్టీతో ఎప్పుడూ అంత విబేధాలు లేవు. ప్రత్యేకించి తెలుగుదేశాధినేతతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉండేవి. గల్లా, నారా ల మధ్య పార్టీలు వేరైనా, ప్రత్యేకానుబంధం మాత్రం ఉండేది. తీరా ఏపీలో కాంగ్రెస్ కథకు తెరపడ్డాకా.. గల్లా ఫ్యామిలీ టక్కున తెలుగుదేశంలో చేరిపోయింది. చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ తో పాటు, గుంటూరు ఎంపీ టికెట్ ను కూడా సంపాదించింది ఆ ఫ్యామిలీ.
గుంటూరులో గల్లా జయదేవ్ గెలిచాడు కానీ, చంద్రగిరిలో అరుణ ఓటమి పాలైంది. చెవిరెడ్డి చేతిలో ఓడిన ఆమె కు తెలుగుదేశం అధికారంలోకి రావడం కొంత ఊరట. అయితే తెలుగుదేశంలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని అరుణ బాధపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఓడిన తనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలనేది ఆమె డిమాండ్. అయితే ఇప్పటి వరకూ అది దక్కలేదు. బాబు ఈ విషయంలో ఆమెను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈనేపథ్యంలో గల్లా అరుణ తెలుగుదేశాధినేతకు ఒక హెచ్చరికనే జారీ చేసిందని సమాచారం.
తనకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించకపోతే తను వైకాపాలో చేరిపోతాను అని ఆమె అంటోందట. ఎలాగూ వైఎస్ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది, తను చేరతానంటే జగన్ కాదనడు.. ఇక ఆలోచించుకోవాల్సింది తెలుగుదేశం వాళ్లే అని గల్లా అంటున్నారట. తనను ఎమ్మెల్సీ ని చేయకపోతే తన దారి తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేస్తున్నారు. తన తనయుడు జయదేవ్ గుంటూరు ఎంపీగా తెలుగుదేశంలోనే ఉన్నా, తను మాత్రం పార్టీ వీడిపోతానని ఆమె ఒక హెచ్చరికనే చేస్తున్నారు. మరి ఆమెకు తెలుగుదేశాధినేత ఎలా సర్ధిచెబుతాడో!