ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైపోయింది. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచే ఎన్నికల మూడ్ లోకి వచ్చేస్తే… ప్రత్యేక హోదా, విభజన హామీలు – కేంద్రంపై పోరాటం పేరుతో ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎన్నికలకే సిద్ధమన్నట్టుగా సభలూ సమావేశాల ప్రణాళికలకు ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అధికార తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య లుకలుకలు చూస్తున్నాం. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో మరొకటి… చంద్రగిరి నియోజక వర్గ పార్టీ బాధ్యతల నుంచి గల్లా అరుణ తప్పుకోవడం. అదేమంత వివాదాస్పద అంశమైతే కాదుగానీ, ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
మూడు దశాబ్దాల రాజకీయ జీవితం నుంచి ఆమె నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దాన్లో భాగంగానే చంద్రగిరి బాధ్యతలు వదులుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. కారణం ఏంటంటే… తన కుటుంబం నుంచి ఒకరే క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నామని ఆమె సీఎంకి ఇటీవల వివరించారట! ఎలాగూ కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి మద్దతుగా నిలిచేందుకు అనువుగా చంద్రగిరి బాధ్యతలు వదులుకున్నట్టు వివరణ ఇచ్చారట. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం చెప్పినా.. ఆమె తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతోంది.
అసలు కారణం వేరే ఉందనే గుసగుసలూ ఉన్నాయి. ఇటీవల కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణ ప్రతిపాదించిన కొంతమందికి అవకాశం దక్కలేదట. దీంతోపాటు, గత ఎన్నికల తరువాతి నుంచి పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న భావన కూడా ఆమెకి ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇదే అసలు కారణమనీ అంటున్నారు. నిజానికి, అలాంటి అసంతృప్తే ఉంటే… గల్లా జయదేవ్ ద్వారా పార్టీ అధినాయత్వానికి తన అభిప్రాయాన్ని తెలియపరచే ప్రయత్నం చేసుకునే అవకాశం ఉండనే ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం గల్లా జయదేవ్ కి టీడీపీలో మంచి గుర్తింపే ఉంది కదా! కాబట్టి, ఆమె చంద్రగిరి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనక అసంతృప్తి కారణం అనే అభిప్రాయానికి ప్రాధాన్యత లేదని అనిపిస్తోంది. ఏదేమైనా, టీడీపీలో గల్లా అరుణ నిర్ణయమై బాగానే చర్చ జరుగుతోంది.