ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పుపై సమగ్ర విశ్లేషణ జరుగుతోందనీ, ఇంకా ఎలాంటి స్పష్టమైన అభిప్రాయాలకూ రాలేదని చెప్పారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాలా అంశాలు చర్చించామనీ, కార్యకర్తలకీ ప్రజలకీ నిత్యం అందుబాటులో నాయకులంతా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీల సాధన విషయంలో గతంలో తాము కేంద్రంతో ఏ ధోరణిలో అయితే పోరాటం చేశామో, అదే పంధా కొనసాగిస్తామని నిర్ణయించినట్టుగా గల్లా జయదేవ్ చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రయోజనాల సాధనను ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లామన్నారు. 2014 ఎన్నికల తరువాత ముందుగా కేంద్రాన్ని ఏపీకి రావాల్సిన వాటిపై అడగడం మొదలుపెట్టామనీ, అప్పటికీ స్పందించకపోవడంతో డిమాండ్ చేశామనీ, అయినా స్పందన రాకపోతే విమర్శలు చేసి ఒత్తిడి పెంచామనీ, చివరిగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే… అదీ చేశామన్నారు గల్లా జయదేవ్. సామ దాన భేద దండోపాయాలు అన్నట్టుగా ముందుకు సాగామన్నారు. కానీ, దశలవారీగా తాము సాగించిన ప్రయత్నాలన్నీ, ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి పడిపోయాయన్నారు. ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి జగన్ కలిశాక… ఏపీ ప్రయోజనాలు తీర్చండి అంటూ అడుగుతామే తప్ప, డిమాండ్ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారన్నారు. అంటే, మొత్తం ప్రయత్నాలన్నీ మళ్లీ సామ దగ్గరకి వచ్చేసిందన్నారు. ఏపీకి దక్కాల్సిన వాటిపై ఎన్నికల వరకూ రాజీలేని పోరాటం టీడీపీ చేసిందనీ, ఇప్పుడూ అదే కొనసాగిస్తుందని జయదేవ్ స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి ఏపీ హక్కులూ హామీల సాధన విషయంలో సీఎం జగన్ ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, పార్లమెంటులో టీడీపీ ఎంపీలు కేంద్రంపై పోరాటం అంటారు, ఇదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీలు బతిమాలే ధోరణిలో మాట్లాడతారా..? గత టీడీపీ ప్రభుత్వ తరహాలోనే… ఓ రెండుమూడేళ్లపాటు ఢిల్లీ చుట్టూ సీఎం చక్కర్లు కొట్టి, ఆ తరువాత పోరాటం అనే పరిస్థితి వస్తుందా..? ఇచ్చేంతవరకూ అడుగుతూ ఉంటామనే ధోరణిలోనే కేంద్రంతో జగన్ వ్యవహరిస్తే… మోడీ ఇస్తారా..? వాస్తవం ఏంటంటే… ఏపీ హక్కుల సాధన కోసం గత ఐదేళ్లుగా కేంద్రంపై దశలవారీగా పెంచిన ఒత్తిడిని… ఇప్పుడు వైకాపా అధికారంలోకి రాగానే మొదటికి వచ్చేసిన పరిస్థితి.