ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. యాభై ఏళ్లుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న గల్లా కుటుంబం నుంచి వచ్చిన జయదేవ్ గుంటూరు నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంపీగా పోరాడారు. అమరావతి కోసం ఉద్యమం చేశారు. కానీ ఆయన వ్యాపారాల మీద ప్రభుత్వం పడింది. అమెరికా నుంచి వచ్చి సొంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వేల కోట్ల పెట్టుబడులు పెడితే.. ఆ కంపెనీలపై నిర్దాక్షిణ్యంగా అధికార దుర్వినియోగం చేసి దాడి చేసింది. ఫలితంగా ఆ కంపెనీలను మెల్లగా తెలంగాణకు తరలించడమే కాదు.. రాజకీయాల నుంచి కూడా విరమించాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంట్ లో ఇరవై నాలుగు శాతం మంది వ్యాపారవేత్తలు ఉన్నారని.. ప్రభుత్వం పై పోరాడితే వ్యక్తిగతం గా వ్యాపారాలని దెబ్బతీసే అవకాశం ఉంది. అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నామన్నారు. హానెస్ట్ గా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం తన వల్ల కాదన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నాననని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారులు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతానన్నారు. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాననని.. బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ…రాజకీయాలు అలా కాదన్నారు. ఈసారి రాజకీయాల్లోకి వచ్చేది అయితే ఫుల్ టైమ్ పొలిటీషియన్ గానే వస్తాననని ప్రకటించారు. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తానన్నారు. జగన్ రెడ్డి చేసిన రాజకీయం వల్ల నితీ, నిజాయితీగా ఉన్న నేత రాజకీయాలకు దూరం కావడమే కాదు.. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. మన రాష్ట్ర యువత పూర్తిగా నష్టపోయింది.