తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని ఒప్పుకున్నరాయితీలు ఇవ్వకపోతే తమ కంపెనీ వేరే ప్రాంతం చూసుకోవడానికి వెనకాడదని అమరరాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ సూటిగా సుత్తిలేకుండానే చెప్పేశారు. ఈ ప్రకటన వ్యాపార వర్గాల్లో హైలెట్ అయింది. హైదరాబాద్ సమీపంలో నిర్మిస్తున్న ప్లాంట్ లో తయారయ్యే బ్యాటరీల కోసం ప్యాకింగ్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఆ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎందుకు చేశారో కానీ.. ఆయన ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ పై అసంతృప్తితోనే చేశారని అనుకుంటున్నారు.
అమరరాజా సంస్థ అంటే తిరుపతి. గల్లా కుటుంబం అమెరికా నుంచి తిరిగి రావడానికి కారణం తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించడం. ఆ పని నిరంతరాయంగా చేశారు. ఓ వరల్డ్ క్లాస్ కంపెనీని తిరుపతి నుంచి బిల్డ్ చేశారు. అమరాన్ బ్రాండ్ తో సంచలనం సృష్టించారు. వేల కుటుంబాలకు ఆలంబనగా ఉన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ కుటుంబాన్ని వేధించింది. దాంతో వారి మాతృభూమి మమకారాన్ని కూడా కాదనుకుని.. కొత్త తరం లిథియం బ్యాటరీల తయారీకి తెలంగాణను ఎంచుకున్నారు.
అమరరాజా ఏపీలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని కేటీఆర్ వేగంగా స్పందించారు. వారి గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. పదేళ్లలో దాదాపుగా పది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ పరంగా పారిశ్రామిక రాయితీలు ప్రకటించారు. అయితే కొత్త ప్రభుత్వం వాటిని అమలు చేసే విషంయలో నిర్లక్ష్యంగా ఉందని అందుకే.. గల్లా జయదేవ్ అలాంటి ప్రకటన చేశారని అంటున్నారు.
నిజానికి గల్లాజయదేవ్ కు అలాంటి ఆలోచన ఉంటే చంద్రబాబు వెంటనే.. మళ్లీ తిరుపతికి వచ్చేసేలా చేస్తారు. అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పిస్తారా అన్నదే అసలు మ్యాటర్.