తెదేపా-భాజపాల మద్య చాలా రోజులుగా సత్సంబంధాలు లేవనే సంగతి అందరికీ తెలిసిందే. అవి జగన్ డిల్లీ పర్యటనతో ఇంకా చెడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ఇప్పుడు హామీల అమలు గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. తెదేపా ఎంపి గల్లా జయదేవ్ ఈరోజు లోక్ సభలో మోడీ ప్రభుత్వాన్ని కడిగిపడేశారు. విభజన చట్టంలో చేర్చలేదని, ఆర్ధిక సంఘం అనుమతించడం లేదనే సాకులతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను తరువాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అమలు చేయకపోతే ఇంకా పార్లమెంటులో మాటలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొనకపోయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు ఇద్దరూ కూడా 2014ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు అ హామీలను అమలుచేయకుండా ఎందుకు మాట తప్పుతున్నారని జయదేవ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించినందుకు 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాకుండా ప్రజలు గుణపాఠం చెప్పారనే సంగతి గుర్తుంచుకోవాలని జయదేవ్ సున్నితంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా మాత్రమే కాకుండా, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని, ఆర్దికలోటుని భర్తీ చేస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చేరని కానీ అరకొర నిధులు విడుదల చేస్తూ హామీలు అమలు చేసేసామని చెప్పడం సరికాదని అన్నారు. రాష్ట్రానికి రూ.16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉందని తేలితే కేవలం 2,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కేంద్రం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోనే శక్తి ఉందని అన్నారు. కనుక ఇప్పటికయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహకరించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని జయదేవ్ కోరారు.
ఈ రెండేళ్లలో చంద్రబాబు నాయుడు, ఎంపిలు వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు ఏకరువు పెట్టి హామీలు అమలు చేయాలని వేడుకొనేవారే తప్ప ఏనాడూ పార్లమెంటులో ఈవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించిన దాఖలాలు లేవు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదివరకులాగా దొంక తిరుగుడు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని పార్లమెంటులో చాలా ఖరాఖండీగా చెపుతోందిప్పుడు. కనుక ఇది తెదేపా-భాజపా సంబంధాలపై తప్పకుండా తీవ్ర ప్రభావం చూపవచ్చు. తెదేపా నేతలందరూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర భాజపా నేతలెవరూ వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. బహుశః భాజపా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారేమో? అది వచ్చేస్తే ఇంకా ముసుగులో గుద్దులాటలు ఉండవు. తెదేపా-భాజపాలు డైరెక్ట్ ఫైట్లే అన్నీను.