గ్రెగ్ చాపెల్ ఇండియా టీం కోచ్ గా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలతో మరోసారి విదేశీ కోచ్ వద్దనుకునేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశీయ కోచ్ లు కూడా తక్కువేం కాదని గంభీర్ నిరూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గంభీర్ వ్యవహారశైలిపై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడే అందరికీ అ డౌట్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో చర్చ ప్రారంభించడంతో అందరూ అదే అంశంపై మాట్లాడటం ప్రారంభించారు. కోచ్ గంభీర్ .. టీమ్‌ను ఖచ్చితంగా విభజించేస్తాడని అంటున్నారు.
అసలేం జరిగిందంటే ?
దుబాయ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో ఇండియా టీం పాకిస్తాన్ పై గెలుపొందింది. ఎక్కడా టీం ఇండియా ఒత్తిడికి గురి కాలేదు. కోహ్లీ క్రీజులో కుదురుకోవడంతో పాకిస్తాన్ మరో వంద పరుగులు చేసి ఉన్నా గెలిచేది కాదని క్లారిటీ వచ్చింది. అయితే నిలకడగా ఆడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. అప్పటికి కోహ్లీ ఎనభైల్లో ఉన్నాడు. కొట్టాల్సిన స్కోర్ 40 వరకూ ఉంటుంది.. ఎలా ఉన్నా చాలా ఈజీగా కోహ్లీ సెంచరీ అవుతుంది.. టీం ఇండియా విజయం దక్కుతుంది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ ను పంపాల్సిన టీం మేనేజ్ మెంట్ హార్జిక్ పాండ్యాను పంపింది.
హిట్టింగ్ చేయాల్సిన అవసరం అక్కడ లేదు. అయినా పాండ్యాను పంపి హిట్టింగ్ చేయించారు. వచ్చీ రాగానే షాట్లు ఆడాడు పాండ్యా. ఆయన హడావుడి చూస్తే.. కోహ్లీ సెంచరీని చెడగొట్టడానికే వచ్చాడేమో అని అందరూ అనుకున్నారు. వెంటనే ఔట్ కావడంతో ఆ విషయం అప్పటికి మర్చిపోయారు. తర్వాత వచ్చిన ఆక్సర్ పటేల్ అలాంటి తప్పు చేయకుండా.. సింగిల్స్ తీసి కోహ్లీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. దాంతో పాండ్యా చేసి పోయిన నష్టాన్ని కోహ్లీ కవర్ చేసుకున్నాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.
మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ హార్దిక్ ను ముందు పంపి హిట్టింగ్ చేయాల్సిన అవసరమేమిటన్న చర్చ ప్రారంభించారు. చివరికి అది హెడ్ కోచ్ గంభీర్ పనేనని.. కోహ్లీపై అసూయతో ఈ పని చేశాడని తీర్మానించుకుని విమర్శించడం ప్రారంభించారు. గంభీర్ మనస్థత్వం.. వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తే ఇదే జరిగి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. టీములో ఇలాంటి రాజకీయాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. అది కోచ్ గుర్తిస్తాడో లేదో మరి !