‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ నుంచి ‘దేవర’ వస్తోంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌గా’ కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానులు గంపెడాశలు పెట్టుకొన్నారు. ఈ రెండు సినిమాలకూ ఓ పోలిక ఉంది. అది కూడా యాధృచ్ఛికమైనదే. ఈ రెండు సినిమాల సెటప్పులు ఒక్కటే. తండ్రి ఆశయాన్ని బతికించడానికి పోరాడే తనయుల కథ.
‘గేమ్ ఛేంజర్’, ‘దేవర’లో హీరోలిద్దరూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి తనకు అత్యంత సన్నిహితుల చేతిలో నమ్మక ద్రోహానికి గురవ్వడం, దానిపై కొడుకు రివైంజ్ తీర్చుకోవడం ఈ రెండు కథల్లోనూ ఉమ్మడిగా కనిపించే లక్షణాలు. ‘గేమ్ ఛేంజర్’ పూర్తిగా పొలిటికల్ డ్రామా. ‘దేవర’ అయితే యాక్షన్ జోన్లో సాగే సినిమా. రెండు సినిమాల్లో హీరోలిద్దరూ రెండు గెటప్పుల్లో కనిపిస్తారు. అలా ఎన్టీఆర్, చరణ్ ఒకే సెటప్పులో ఉన్న కథల్ని ఎంచుకోవడం కాకతాళీయమే. ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ మాత్రం సింగిల్ సినిమానే. రాజమౌళితో పని చేసి, సూపర్ హిట్ కొట్టిన హీరోలు ఆ తరవాతి సినిమాలో అంచనాలు అందుకోలేక చతికిల పడ్డారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఈ అనుభవం ఉంది. మరి ఈసారి ఏం జరుగుతుందో అనే ఆత్రుత అందరిలోనూ ఉంది. అందుకే వీరిద్దరూ తమ తదుపరి సినిమాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొన్నారు. మరి ఈ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురు చూడాలి.