Game Changer Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
భారతీయ సినిమాకు శంకర్ ఓ గేమ్ చేంజర్. వెండి తెరకు భారీదనాన్ని పరిచయం చేశాడు. పాటల్లో తన మ్యాజిక్ చూపించాడు. విజువల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించాడు. ఓ సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు అద్దడంలో సిద్దహస్తుడు అనిపించుకొన్నాడు. ఎంత గొప్ప కట్టడమైనా, ఎప్పుడో ఒకప్పుడు బీటలు వారుతుంది. శంకర్ కెరీర్‌కూ అది ఎదురైంది. వరుసగా ఫ్లాపులు తగిలాయి. `భారతీయుడు 2` అయితే శంకర్ పని అయిపోయిందా? అనే అనుమానాన్ని కలిగించింది. కానీ.. ఎక్కడో ఓ చిన్న నమ్మకం. భవనం బీటలు వారినా, పునాది గట్టిగా ఉంటుందిలే అనే నమ్మకం. ఆ నమ్మకమే `గేమ్ చేంజర్`పై కూడా ఉంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత రామ్ చరణ్ నటించిన సినిమా ఇది. స్టార్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా పరిశ్రమకు ఆయువు పట్టులాంటి నిర్మాత దిల్ రాజు 50వ సినిమా కూడా ఇదే. అందుకే `గేమ్ చేంజర్`పై నమ్మకాలు సడల్లేదు. పైగా ట్రైలర్లో శంకర్ మార్క్ విజువల్స్ కనిపించాయి. ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలలో చరణ్ కు ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు దర్శక నిర్మాతలు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా. మరి ఇన్ని ప్రత్యేకతల నడుమ విడుదలైన గేమ్ చేంజర్ ఎలా వుంది? నిజంగానే శంకర్ మార్క్ ఉందా? ఆర్.ఆర్.ఆర్ తరవాత చరణ్ విజయ పరంపర కొనసాగించాడా?
రామ్ నందన్ (రామ్ చరణ్) విశాఖకు కలెక్టర్‌గా వస్తాడు. ఏపీలో అభ్యుదయం పార్టీ అధికారంలో ఉంటుంది. ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) చేతిలో మరో యేడాది అధికారం ఉంటుంది. ఈ యేడాది అవినీతిని పక్కన పెట్టి, ప్రజలకు సేవ చేయాలని మంత్రుల్ని, ఎం.ఎల్.ఏలను ఆదేశిస్తాడు. సత్యమూర్తి తనయుడు మోపీదేవి (ఎస్.జె.సూర్య)కు తండ్రి సీటుపై గురి. తండ్రి ఎప్పుడు పోతాడా? సీఎం ఎప్పుడు అయిపోదామా అని కాచుకొని కూర్చుంటాడు. మరోవైపు కలెక్టర్ కొరకరాని కొయ్యలా తయారవుతాడు. మోపీదేవి అక్రమాలకు చెక్ పెడతాడు రామ్ నందన్. ఈలోగా సత్యమూర్తి చనిపోతాడు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోపీదేవిని పార్టీ పెద్దలు బలపరుస్తారు. మోపీదేవినే సీఎం అని అంతా ఫిక్సయిపోయే తరుణంలో ఈ కథ మలుపు తిరుగుతుంది. రామ్ నందన్‌కు సంబంధించిన ఓ నిజం బయటపడుతుంది. అదేమిటి? ఆ తరవాత ఏమైంది? ఫ్లాష్ బ్యాక్‌లో అప్పన్న (రామ్ చరణ్) కథేమిటి? తనకూ సత్యమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
పోకిరి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమా చేయాలని తనకు ఉండేదని, ఆ ఆలోచన నుంచి వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’ అని శంకర్ ఓ సందర్భంలో చెప్పాడు. మన తెలుగు సినిమాలు శంకర్ కు స్ఫూర్తి ఇవ్వడం వరకూ ఓకే. తెలుగువాళ్లుగా మనం గర్వించాలి. కాకపోతే.. ఇది పోకిరి, ఒక్కడు జమానా కాదు. తరం మారిపోయింది. ఆలోచనలు మారాయి. కమర్షియల్ పంథా కూడా మారిపోయింది. పోకిరి, ఒక్కడు హిట్ అయ్యాయంటే, అప్పటికి అవి పాత్ బ్రేకింగ్ సినిమాలు. ఓ కొత్త పంథాలో సాగిన కమర్షియల్ పాయింట్స్. అంతెందుకు? శంకర్ తీసిన భారతీయుడు, ఒకే ఒక్కడు.. సినిమాలు కూడా పాత్ బ్రేకింగ్ సినిమాలే. కమర్షియల్ సినిమాల్ని కొత్త దారి పట్టించిన సినిమాలు. అయితే ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్లి సినిమాలు తీస్తానంటే కుదరదు. మారిన అభిరుచులు, ప్రేక్షకుల ఆలోచన సరళిని బట్టి కథలు మారాలి. అందులో హీరోయిజం మారాలి. దురదృష్టవశాత్తూ ‘గేమ్ చేంజర్’లో ఇది జరగలేదు.
ఓ నిజాయతీగల ఆఫీసర్కీ, అవినీతి పరుడైన మంత్రికీ మధ్య జరిగిన పోరాటం ఇది. టిట్ ఫర్ టాట్ లా సాగే సన్నివేశాలతో కథని రక్తికట్టిద్దామనుకొన్నాడు శంకర్. ఆలోచన వరకూ బాగుంది. మరి ఆచరణ? ఇప్పటికీ ఒకే ఒక్కడు ఫార్మెట్ లోనే సన్నివేశాలు అల్లుకొని, కథని నడిపించేద్దామనుకొన్నాడు శంకర్. `ఒకే ఒక్కడు`లో అర్జున్ వ్యవస్థపై పోరాటం చేశాడు. కానీ ఇక్కడ హీరో పోరాటం ఓ వ్యక్తిమీద. దాంతో విస్కృతంగా చెప్పాలనుకొన్న ఓ అంశాన్ని తనకు తానుగా కుదించేసుకొన్నాడు శంకర్. రౌడీ షీటర్లను, అడ్డగోలుగా సంపాదిస్తున్న వ్యాపారస్థుల్ని రెండు బస్సుల్లో ఎక్కించుకొని.. విశాఖపట్నమంతా తిప్పుతూ, అక్కడిక్కడే రూల్స్ అమలు చేసేలా తీర్చిదిద్దిన సన్నివేశాలు ‘ఓకే’ అనిపిస్తాయి అంతే. అంతే తప్ప.. అక్కడ శంకర్ మార్క్ కనిపించదు. ఇది వరకు చూసిన శంకర్ సినిమాల తాలుకూ వాసన అక్కడ తగులుతుంది. శంకర్ ఇంతకు మించి కదా ఆలోచించాలి? అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో కాలేజీ సన్నివేశాల్లో హీరో తాలుకూ కోపం అనే ఎలిమెంట్ కు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారు. అక్కడ కామెడీ కూడా పండలేదు. కోపాన్ని తగ్గించుకోవడానికి హీరో నడి రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే – మనకు కోపం వస్తుంది. శంకర్ ఏమిటి.. ఇలా ఆలోచిస్తున్నాడు? అని.
ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ఓ ట్విస్టు వుంది. అది సినిమాపై కాస్తంత ఆసక్తి పెంచుతుంది. ఇంట్రవెల్ తరవాత అప్పన్న ఎపిసోడ్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌పై శంకర్ కాస్త హోమ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. దానికితోడు అప్పన్న క్యారెక్టర్ కోసం చరణ్ తన సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. ఆ పదిహేను నిమిషాలూ చరణ్ నటనకు అరెస్ట్ అయిపోతాం. అయితే ఆ తరవాత మళ్లీ… యధా రాజా, తధా ప్రజా అన్నట్టు రొటీన్ సన్నివేశాలు విసిగిస్తాయి. రామ్ నందన్ ఎలక్షన్ కమీషనర్‌గా రావడం కాస్త హై ఇచ్చే మూమెంటే. కానీ.. ఎలక్షన్ కమీషనర్ కీ, ముఖ్యమంత్రికీ జరిగిన డ్రామా అంతగా రక్తి కట్టలేదు. ప్రీ క్లయిమాక్స్ లో మదర్ సెంటిమెంట్ ని నమ్ముకొన్నారు. అది కాస్త హార్ట్ టచింగ్ గానే తీశారు. అది పూర్తవగానే మళ్లీ రొటీన్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ .. బహుశా శంకర్ కెరీర్లోనే వీకెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ లా అనిపిస్తుంది.
చరణ్ నటుడిగా ఎక్కడా నిరాశ పరచడు. కలెక్టర్‌గా హుందాగా కనిపించాడు. తన అప్పీరియన్స్ బాగుంది. అప్పన్న పాత్రలో.. మరింత రాణించాడు. అక్కడ రంగస్థలం నాటి చరణ్ కనిపిస్తాడు. ఈ సినిమాని కాపాడేందుకు అప్పన్న శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. ఈ సినిమాతో చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అన్నారు. అంత కాకపోయినా.. చరణ్‌లోని నటుడ్ని మరోసారి చూశామన్న సంతృప్తి అభిమానులకు దొరుకుతుంది. ఎస్.జె.సూర్య రొటీన్, లౌడ్ విలనిజాన్ని చూపించాడు. కొన్నిసార్లు విసిగిస్తాడు కూడా. కైరాది కమర్షియల్ కొలతల్లో సాగిపోయే హీరోయిన్ పాత్ర. అంజలి గెటప్ ఆశ్చర్యపరుస్తుంది. మెడ పక్కన పెట్టే మేనరిజం అంజలితో పాటుగా, సునీల్ కీ ఎందుకు ఇచ్చారో అర్థం కాదు. శంకర్ సినిమా అనగానే లెక్కకు మించిన పాత్రలు కనిపిస్తాయి. వాళ్ల మధ్యలో గుంపులో గోవిందం తరహా పాత్రలెన్నో. ఈ సినిమాలోనూ అంతే. ప్రియదర్శి అనే నటుడు ఈ సినిమాలో ఉన్నాడని తెలియడానికి ఒకటికి రెండు సార్లు చూడాలి. ఎందుకంటే ఆ పాత్రకు ఒక్క డైలాగ్ కూడా లేదు. శ్రీకాంత్ అప్పీరియన్స్ కొత్తగా ఉంది. ఆ పాత్రలో తన అనుభవాన్ని రంగరించారు.
దిల్ రాజు కెరీర్లోనే కాస్ట్లీ సినిమా ఇది. ఆ భారీదనం తెరపై కనిపించింది. జరగండి.. తోప్ పాటలు కలర్‌ఫుల్ గా అనిపించాయి. తమన్ ఆర్.ఆర్ ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల లౌడ్నెస్ ఎక్కువ ఉంది. యాక్షన్ సీన్లు మరీ గొప్పగా లేవు. క్లైమాక్స్ ఫైట్ చాలా వీక్. ‘నానా హైరానా’ పాట సినిమాలో లేదు. మళ్లీ ఎప్పుడో కలుపుతారట. కలిపినా ప్లేస్ మెంట్ దొరకడం చాలా కష్టం. కోట్లు పోసి తీసిన పాటకు ప్లేస్ మెంట్ దొరక్కపోవడం అన్యాయం. బుర్రా సంభాషణలు అక్కడక్కడ మెరిశాయి. అయితే.. కామెడీ రాయడంలో ఆయన కలం చాలా వీక్. ఈ సినిమాతో అది మరోసారి నిరూపితమైంది. శంకర్ మామూలు కమర్షియల్ దర్శకుడిగా మారిపోయి, సేఫ్ గేమ్ ఆడేద్దామని తీసిన సినిమాలా అనిపిస్తుంది. శంకర్ సినిమాలు చూడ్డానికి ప్రేక్షకుడు ప్రత్యేకంగా సిద్ధమవుతాడు. ఆ ప్రత్యేకత మిస్ అయ్యింది. తన సినిమాల్ని తానే కాపీ కొట్టి తీసినట్టు అనిపిస్తుంది.
ఆరో తరగతిలో ఓ సోషల్ పాఠం ఉంటుంది. కలెక్టరు ఎవరు? ఆయన అధికారాలు ఏమిటి? అని. ఆ సోషల్ పాఠాన్ని సినిమాగా తీస్తే `గేమ్ చేంజర్` అవుతుంది. అదనంగా.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అధికారాల్ని కూడా చూపించారు. కలెక్టర్‌కీ, ఎలక్షన్ ఆఫీసర్కీ ఇన్ని అధికారాలు ఉంటాయా? అనే ఆశ్చర్యం, కొంత ఇన్ఫర్మేషన్.. ప్రేక్షకులకు వస్తుంది. కానీ అది ఇంటర్నెట్ లోనూ దొరుకుతుంది. శంకర్ లాంటి దర్శకుడు ఇంతకు మించి కదా చెప్పాలి? ఎక్కడా శంకర్ మార్క్ లేకుండా, శంకర్ తీసిన ఫక్తు.. కమర్షియల్ సినిమా ఇది. సంక్రాంతికి రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే మిగిలిన రెండు సంక్రాంతి సినిమాల ఫలితాలపైనే ఇప్పుడు గేమ్ చేంజర్ జాతకం ఆధారపడి వుంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5