‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబో నుంచి వస్తున్న సినిమా కాబట్టి… భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రమోషన్ కంటెంట్ విషయంలో చిత్రబృందంపై నిరాశగా ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకూ కేవలం రెండు పాటలే బయటకు వచ్చాయి. దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. సంక్రాంతి సీజన్లో వస్తున్న సినిమా కాబట్టి, మినిమం గ్యారెంటీ ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు.
ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మెల్లగా స్పీడప్ చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈనెల 9న టీజర్‌ని విడుదల చేస్తున్నారు. లక్నోలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ముందుగా హైదరాబాద్‌లోనే ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ… ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వేదిక లక్నోకి మారింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి, దేశ వ్యాప్తంగా ప్రమోషన్లు చేయాల్సిందే. ఎక్కడ ఈవెంట్ చేసినా, ఈ సినిమాకొచ్చే క్రేజ్ ఎలాగూ వస్తుంది కాబట్టి, లక్నోని ఫిక్స్ చేశారు. ఇక నుంచి కనీసం రెండు వారాలకు ఓ ఈవెంట్ చేయాలని, లేదంటే.. కనీసం అప్డేట్లు ఇవ్వాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ పలు లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఆ లుక్స్ అన్నీ టీజర్లో రివీల్ చేయకపోవొచ్చు. సినిమా కాన్సెప్ట్ తెలిసేలా, ఓ థీమ్‌ని ఫాలో అవుతూ ఈ టీజర్ కట్ చేశారని తెలుస్తోంది. ‘భారతీయుడు 2’ తరవాత శంకర్ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ‘గేమ్ ఛేంజర్’తో మళ్లీ ఫామ్ లోకి రావడం శంకర్‌కు అత్యవసరం. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తరవాత ఆ టెంపోని కొనసాగించడం కూడా చరణ్‌కు ముఖ్యమే. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.