కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తెలంగాణ ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఈ దశలో కేసుల సంఖ్య ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నా, ముందస్తు జాగ్రత్త చర్యలకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. కరోనా మూడో దశకు చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. దీన్లో భాగంగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు ఈటెల. వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు, ఆశా వర్కర్లను ఎక్కడివారు అక్కడే ఉండాలనీ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఇళ్లలోనూ, సెంటర్లలోనూ క్వారంటైన్ లో ఉన్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ దశకు ఇక్కడితోనే బ్రేకులు వెయ్యాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. కరోనాకి సంబంధించి నోడల్ సెంటర్ గా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పనిచేస్తోంది. ఇప్పుడు పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చాలన్న ఉద్దేశంతో… ఇప్పటికే అక్కడ ఓపీ సేవల్ని నిలిపేశారు. ఇతర సర్జరీలను కూడా ఇక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి బదిలీ చేయబోతున్నారు. అయితే, గాంధీతోపాటు నల్లకుంటలోని ఫీవర్, చెస్ట్ హాస్పిటళ్లలో పాజిటివ్ కరోనా పాజిటివ్ కేసులకు ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. కరోనా పరీక్షల కోసం ఆరు ల్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రోజుకి వంద మందికి టెస్టులు చేసే సామర్థ్యం ఇక్కడుంది. అయితే, త్వరలో సామర్థ్యాన్ని రోజుకి దాదాపు 700 వరకూ పెంచేందుకు వీలుందని అంటున్నారు. ఐసీఎమ్మార్ కి కూడా అనుమతి ఇవ్వడంతో రోజువారీ టెస్టుల సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది.
ఏదేమైనా, ఎట్టి పరిస్థితుల్లో మూడో దశకు ఈ వైరస్ వ్యాప్తి వెళ్లనీయకుండా కట్టడి చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఓపక్క, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమౌతోంది. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు, వైరస్ సోకినవారు, వైద్య సిబ్బంది ధరించేందుకు అవసరమైన దుస్తులు ఇతర సామగ్రిని కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలని మంత్రి ఈటెల ఆదేశించారు. ఇంకోపక్క, లాక్ డౌన్ కూడా ప్రస్తుతం కట్టుదిట్టంగా అమల్లోకి రావడంతో… త్వరలో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే అనిపిస్తోంది.అయితే, రెండో దశ వ్యాప్తి తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది.